
Jr NTR:సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన సరదా స్వభావంతో వార్తల్లో నిలిచారు. అభిమానులతో ఎప్పుడూ ఆప్యాయంగా మెలిగే తారక్, తాజాగా ఓ అభిమానికి
ఇచ్చిన సర్ప్రైజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా ఇంట్లో తయారు చేసిన కుకీస్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. హీరో చేతివంట చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, సాయితేజ అనే అభిమాని సరదాగా స్పందించాడు. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అన్నా.. రెండు కుకీస్ పంపిస్తారా? అంటూ కామెంట్ చేశాడు.ఈ కామెంట్‌కు తారక్ కూడా తనదైన స్టైల్లో స్పందించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పిన అడ్రస్ పెట్టు... ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు అనే ప్రసిద్ధ డైలాగ్ వీడియోను రిప్లైగా షేర్ చేశారు. దీంతో అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు.
అయితే తారక్ సరదా సమాధానంతోనే ఆగిపోలేదు. ఆ అభిమాని అడిగినట్లుగానే నిజంగానే కుకీస్ పంపించి అతడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఆ అభిమాని ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ఈ విషయం క్షణాల్లో వైరల్‌గా మారింది.
స్టార్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ అభిమానుల చిన్న కోరికను కూడా గుర్తించి నెరవేర్చడం తారక్ గొప్పతనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అభిమానులతో ఆయనకు ఉన్న అనుబంధం మరోసారి ఈ ఘటనతో స్పష్టమైందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరో అభిమాని బిర్యానీ, నాటుకోడి వండే మీరు ఇప్పుడు కుకీస్ కూడా చేస్తున్నారా? అని ప్రశ్నించగా, దానికి కూడా తారక్ తనదైన హాస్యంతో స్పందించారు. అన్నీ మారాయి అనే ప్రసిద్ధ సినిమా డైలాగ్ వీడియోను షేర్ చేస్తూ అభిమానులను అలరించారు.
ప్రస్తుతం తారక్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. వెండితెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ తారక్ మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నారు.