
భారతీయ సంగీత ప్రపంచంలో అత్యంత ప్రముఖ గాయనీమణులలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఒకరు. ఆమె భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు. 1974లో రామన్ మాగ్సేసే అవార్డు అందుకున్న తొలి భారతీయ సంగీత విద్వాంసురాలు కావడం విశేషం. కాగా కొన్నాళ్లుగా ఈ లెజెండరీ గాయని బయోపిక్ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది. ‘జెర్సీ’, ‘కింగ్డమ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్నూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నటి రష్మిక మందన్న నటించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు కూడా ప్రకటించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం చెన్నైలోని ‘ది మ్యూజిక్ అకాడమీ’లో జరిగింది. నటుడు కమల్ హాసన్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించగా.. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ చిత్ర సహ నిర్మాత గీతా ఆర్ట్స్, సోషల్ మీడియాలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రకటించింది. “ఒక మరపురాని వేడుకతో వారసత్వం మొదలవుతుంది,” అని ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది.




