© 2026 nimisham.in
మూడు సంవత్సరాల మూడు నెలల వయసు.. అప్పుడప్పుడే నడక నేర్చుకునే పసిప్రాయం. కానీ అనంత దక్షిత్ అలా కాదు.. ఈ వయసులోనే అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 79 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేసి అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఉదయం 6:15 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత దక్షిత్.. సాయంత్రం 6:40 గంటలకు గమ్యాన్ని చేరుకున్నాడు. మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్ చేస్తూ.. 12 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఇక ఈ దూరం కూడా అనుకోకుండా ఎంపిక చేసింది కాదు.. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 79 ఏళ్లు పూర్తి చేసుకుని.. 80వ పంద్రాగస్టు వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ఈ దూరాన్ని ఎంపిక చేసుకున్నారు.అనంత దక్షిత్ కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిత్ ఈ ఫీట్ పూర్తి చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా పసిఫిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్లలో చోటు దక్కించుకున్నాడు. అనంత దక్షత్ అసాధారణ ప్రదర్శన వెనుక నెలల తరబడి సాధన, దృఢ సంకల్పం, అతని కుటుంబం కల ఉన్నాయి. కుమారుడికి స్కేటింగ్ నేర్పించాలనేది అతని తండ్రి అనంత వాసుదేవ కోరిక. ఏడాదిన్నర వయసు ఉన్నప్పటి నుంచే దక్షత్కు స్కేటింగ్ వీడియోలను చూపించడం ప్రారంభించారు. అలా అతనికి స్కేటింగ్ మీద చిన్నప్పుడే ఇష్టం పెంచారు. రెండేళ్లు పూర్తి కాగానే స్కేటింగ్ అకాడమీలో చేర్పించారు.పంద్రాగస్టుకు దాదాపు మూడు నెలల ముందు నుంచి సాధన తీవ్రత పెంచారు. ట్రైనింగ్ సమయంలో దక్షత్ సుమారు 2,950 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. ట్రైనింగ్ సమయంలో ఏకబిగిన 38 కిలోమీటర్లు స్కేటింగ్ చేసిన దక్షత్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏకంగా 79 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడం విశేషం. ఈ సమయంలో దక్షిత్ కేవలం రెండుసార్లు.. ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకున్నాడు
. ద్రవ పదార్థాలు అందిస్తూ, చిన్నారికి నిద్రరాకుండా ఉండేందుకు చల్లటి నీరు ఉపయోగిస్తూ ఈ ఫీట్ పూర్తి చేశారు. ఈ జర్నీ సమయంలో స్కేటింగ్ అకాడమీ నిర్వాహకులు, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెంట ఉన్నారు.