© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 22A Dispute : తెలుగు రాష్ట్రాల్లో 22 ఏ ( నిషేధిత భూముల జాబితా) వివాదం రచ్చలేపుతోంది. లక్షలాది మంది రైతులు, ఆస్తి యజమానుల పాలిట శాపంగా మారింది సెక్షన్ 22ఏ. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసి.. పక్కగా సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూములు కూడా ఆకస్మాత్తుగా ఈ 22 ఏ జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ రికార్డుల ప్రక్షాళన విధానంలోని లోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేవలం బ్రిటిష్ కాలం పాత పత్రాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఆ తర్వాత దశాబ్దాల పాటు జరిగిన చట్టబద్ధమైన క్రయవిక్రయాలను, యాజమాన్య బదిలీలను పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల వ్యవసాయ పట్టాభూములు రికార్డుల్లో రాత్రికి రాత్రే ప్రభుత్వ ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రభుత్వ సాంకేతిక తప్పిదం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై క్రయవిక్రయాల హక్కులు కోల్పోయి యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై సెంటర్ ఫర్ లిబర్టీ అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి విశ్లేషించారు. రికార్డుల అప్ డేట్ లో భాగంగా జరిగిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రస్తుత గందరగోళానికి మూలకారణమని స్పష్టం చేశారు. కింది స్థాయిలోని లావాదేవీల చరిత్రను పరిగణలోనికి తీసుకోకుండా.. ఏకపక్షంగా సామాన్య భూములను 22ఏ జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని నల్లమోతుల వివరించారు. ఈ అన్యాయంపై ముఖ్యంగా ఏపీలో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు
నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న యజమానులు, తమ పట్టా భూములను వెంటనే 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో పెద్దెత్తున ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు.
ఏపీలో మాత్రమే కాదు.. తెలంగాణలో ఈ వివాదం రచ్చకెక్కింది. సొంతింటి యజమానులపై రాష్ట్ర సర్కార్ 22 ఏ పిడుగు వేయడం.. ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఇంటికి ఉన్నట్లుండి.. నిషేధిత ముద్ర పడటంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్ మెంట్లు స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్సులను అకస్మాత్తుగా 22 ఏలో చేర్చారు. దీంతో పిల్లల పెళ్లిళ్లు, విదేశీ చదువులు, వైద్యం, ఇతర ఆర్థిక అవసరాల కోసం ప్రాపర్టీలను విక్రయించుకోలేని నిస్సహాయ స్థితిలో యజమానులు ఉన్నారు. తమ ప్రాపర్టీని 22 ఏ నుంచి తొలగించండంటూ దరఖాస్తులు పట్టుకుని కలెక్టర్లెట్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక.. అధికారుల నుంచి సరైన సమాధానం రాక తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, షేక్ పేట్, అమీర్ పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్ చెర్వు, రామచంద్రాపురం, అమీన్ పూర్, బహదూర్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోని ఆస్తులు భూములు ఎక్కువగా నిషేధిత జాబితాలోనే ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు, భూముల్లో దాదాపు 54 శాతం కంటే ఎక్కువగా మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లోనే ఉండటంతో ఈ నాలుగు జిల్లాల్లో లక్ష కంటే ఎక్కువగా ఇళ్లు, ఖాళీ ప్లాట్లు, బహుల అంతస్తుల అపార్ట్ మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ లు రెవెన్యూ రికార్డుల్లో 22ఏ జాబితాలోనే ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. లక్షల కోట్లకు పైమాటే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్యాంకులు వీటిపై ఇప్పటికే హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఉన్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకింగ్ రంగంలో కూడా ఆందోళన మొదలైంది.
ఈ సెక్షన్ 22 ఏ భూముల వివాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ధరణి పోర్టల్ లో లోపాలు 22 ఏ కింద అమాయక రైతులు, సామాన్య ప్రజల భూములను చేర్చి వేధిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో రెవెన్యూ యంత్రాంగంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 22 ఏ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లోని భూసమస్యల తీవ్రత ద్రుష్ట్యా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్ అధికారులు పాల్గొన్నారు. 22ఏ పరిధిలో ఉన్న భూముల వివరాలను మంత్రి ఆరా తీశారు. అసలు ఏయే ప్రాంతాల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎప్పుడు వచ్చాయి.. ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయంటూ అధికారులపై ప్రశ్నలు కురిపించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుడదన్న ఉద్దేశ్యంతోనే మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతోపాటు నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయడం ఈ రెండూ ప్రభుత్వానికి సమానమేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
అసలు సమస్య ఇదే. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22 ఏ అనేది క్రయ విక్రయాలకు అర్హత లేని నిషేధిత భూములు ఆస్తుల జాబితా. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఈ సెక్షన్ కిందకు వస్తాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల అప్ డేట్ లో భాగంగా ఆస్తులను 22 ఏ జాబితాలో చేర్చడంతో అసలు సమస్య తలెత్తింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.