© 2026 nimisham.in
14814 government teachers fail TET : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి ఫలితాల్లో అభ్యర్థులు తీవ్రంగా నిరాశపరిచారు. పరీక్ష రాసిన వారిలో సగం మంది కూడా క్వాలిఫై కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.94 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో టెట్ కన్వీనర్ జి. రమేశ్, టెట్ డైరెక్టర్ రేవతిరెడ్డిలతో కలిసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 1,15,028 మంది పరీక్షకు హాజరుకాగా.. కేవలం 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే సగం కంటే తక్కువ మంది పాస్ కావడం గమనార్హం.సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల కోసం నిర్వహించిన పేపర్-1 పరీక్షలో 65.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 36,129 మంది పరీక్ష రాయగా 23,590 మంది పాస్ అయ్యారు. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన పేపర్-2లో ఫలితాలు చాలా ఘోరంగా ఉన్నాయి. పేపర్-2లో మొత్తం 78,899 మంది పరీక్ష రాస్తే కేవలం 26,954 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇందులో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 40.76 శాతం (17,987 మంది) ఉత్తీర్ణత సాధించగా.. సోషల్ స్టడీస్ విభాగంలో అత్యల్పంగా 25.79 శాతం (8,967 మంది) మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం.ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి మరీ ఘోరం.. మరోవైపు ప్రస్తుతం విధుల్లో ఉంటూ ఈ పరీక్ష రాసిన ఇన్-సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు హాజరుకాగా.. కేవలం 8,809 మంది (37.29%) మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఏకంగా 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ కావడం విద్యాశాఖ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గతేడాది ప్రభుత్వ టీచర్ల పాస్ పర్సంటేజ్ 50 శాతంగా ఉండగా.. ఈసారి అది
37.29 శాతానికి పడిపోయింది. ఇన్-సర్వీస్ టీచర్లలో పేపర్-1లో 52.57 శాతం, పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 38.27 శాతం, సోషల్‌లో అత్యంత దారుణంగా 24.05 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.2028 ఆగస్టు వరకూ పాస్ కాకపోతే ఉద్యోగాలు ఫట్..సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి ఖచ్చితంగా టెట్ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ డెడ్‌లైన్‌లోగా టెట్ క్వాలిఫై కాకపోతే వారు తమ ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే తాజా పరీక్షలో 14 వేల మందికి పైగా టీచర్లు ఫెయిల్ కావడంతో వారి ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది.