
సందీప్ కిషన్ ఇది వరకు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కనిపించాడు. కానీ సోలో హీరోగా సందీప్ కిషన్ వెబ్ సిరీస్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ‘సూపర్ సుబ్బు’ అంటూ సందీప్ కిషన్ ఓటీటీలోకి వచ్చాడు.
ఈ సిరీస్‌ను మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో మురళీ శర్మ, మానస చౌదరి, మిథిలా పార్కర్, గెటప్ శ్రీను వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అన్నది ఓ సారి చూద్దాం. కథ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కుక్కుటేశ్వర్ రావు (మురళీ శర్మ) కొడుకు. కుక్కుటేశ్వర్ దృష్టిలో సుబ్బు ఓ పనికి రాని వాడు, అప్రయోజకుడు. తన రికమండేషన్‌తో పెట్టించిన టెంపరరీ జాబ్‌ని కూడా సరిగ్గా చేయడం చేతకాదు అని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటాడు. ఇక సుబ్బుకి దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు కుక్కుటేశ్వర్. టెంపరరీ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకుంటే గానీ పెళ్లి జరగదు అని కుక్కుటేశ్వర్ కండీషన్ పెడతాడు. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకునేందుకు ప్రిన్సిపాల్ మదు సూధన్ (బ్రహ్మానందం) చెప్పిన పని చేస్తానని అంటాడు సుబ్బు. ఈ క్రమంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా మాకీపూర్కి వెళ్లాలని కండీషన్ పెడతాడు ప్రిన్సిపాల్. చదువు సంధ్యల్లేని కుగ్రామమైన మాకీపూర్కు వెళ్లిన సుబ్బు ఏం చేస్తాడు? అక్కడ ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ ప్రోగ్రాంని ఎలా అమలు పర్చుతాడు? ఆ ఊరిలో ఉండే స్వాతి (మిథిలా పార్కర్)తో సుబ్బు ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? మామూలు సుబ్బు నుంచి.. సుబ్బు సార్, సూపర్ సుబ్బు వరకు కథ ఎలా వెళ్తుంది? అన్నది తెలియాలంటే సిరీస్ అంతా చూడాల్సిందే. సెక్స్ ఎడ్యుకేషన్ అనే పాయింట్ చర్చించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటేనే ఓ రకంగా చూస్తుంటారంతా. ఇక సిటీల్లో ఇప్పుడు అంతో ఇంతో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ మారుమూల గ్రామాల్లోని ప్రజలకు దీని గురించి ఎలాంటి పరిచయం ఉండదు. కుటుంబ నియంత్రణ, సురక్షితమైన శృంగారం వంటి వాటిపై ఇప్పుడు చాలా వరకు ప్రజల్లో ఓ అవగాహన ఏర్పడింది. ఇక ఇటువంటి గురించి ఏమీ తెలియని ఓ గ్రామానికి.. తప్పని పరిస్థితుల్లో వచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎదుర్కొన్న సవాళ్లే ఈ సూపర్ సుబ్బు. ఇలాంటి పాయింట్‌ను చెప్పడంతో అంత ఆశామాషీ విషయం కాదు. ఇక చాలా వరకు ఎంతో క్లిష్టమైన విషయాల్ని ఎంతో సున్నితంగా, ఎంతో వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు. మగ పిల్లాడు పుట్టాలి అంటే ఏం చేయాలని ఊర్లో మహిళలంతా అడుగుతారు. వారికి ఎక్స్ క్రోమోజోములు, వై క్రోమోజోములు అని సిటీలో చెప్పినట్టుగా చెబితే అర్థం కాదు.. అలాంటి విషయాన్ని రెండు పూల కుండీలను తీసుకుని.. ఇందులో ఉన్నది ఒకటే మట్టి.. కానీ ఒక దాంట్లో ఒక పూల చెట్టు.. ఇంకో దాంట్లో ఇంకో పూల చెట్టు ఉంది.. ఎందుకు? అని అడుగుతాడు. ఏ విత్తనం వేస్తే.. ఆ విత్తనం మొలకెత్తుతుంది.. అని మహిళలంతా చెబుతారు. మరి మట్టిని తిడితే ఏం లాభం ఉంటుంది.. అని అందరికీ అర్థమయ్యేలా చెప్పేస్తాడు సుబ్బు. ఇలా ఈ అడల్ట్ కంటెంట్ సిరీస్‌ని కూడా ఎక్కడా అశ్లీలతకు తావివ్వకుండా.. వినోదభరితంగా తెరకెక్కించడంలో మల్లిక్ రామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఇల్లాజికల్‌గా, సాగదీతగా, ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా సాగుతుంది. ఏ పాత్రతోనూ ఎమోషనల్ సీన్లను అంతగా పండించలేకపోయారనిపిస్తుంది. కామెడీ మాత్రం చాలా చోట్ల వర్కౌట్ అయింది. సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ చక్కగా నటిస్తాడు. సందీప్ కిషన్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా సుబ్బు పాత్రలో లైన్ దాటకుండా నటించాడు సందీప్ కిషన్. మిథిలా పార్కర్ పాత్రను మల్చిన తీరు బాగుంటుంది. మానస శర్మ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ఆమెకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా లభించినట్టు అనిపిస్తుంది. సంపూర్ణేశ్ బాబు, మురళీ శర్మ, గెటప్ శ్రీను ఇలా చాలా పాత్రలు చాలా చోట్ల నవ్విస్తాయి. రమేష్ బాబుగా జీవన్ పాత్ర, ఊర్లోని వేశ్య రజినీ పాత్ర ఊర్లో కనిపించే కారెక్టర్స్ ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. సూపర్ సుబ్బు టెక్నికల్ టీం గురించి మాట్లాడుకుంటే.. కెమెరా వర్క్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఊరి వాతావరణాన్ని చక్కగా చూపించారు. చాలా రియలిస్ట్‌గా అనిపిస్తుంది. పాటలు అంతగా మెప్పించకపోవచ్చు. ఇక ఓటీటీలోనే కాబట్టి.. ఆ పాటల్ని ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు. బోరింగ్‌గా అనిపించే సీన్లు కూడా వస్తుంటాయి. వాటిని కూడా అలా స్కిప్ చేసుకుంటూ చూసేయొచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుంటాయి. డైలాగ్స్ విషయానికి వస్తే.. చాలా వరకు బార్డర్‌కు ఇటు వైపే ఉండి.. ఎంతో క్లిష్టమైన విషయాల్ని కూడా సునాయంగా అర్థమయ్యేలా చెప్తారు. మొదటి సీజన్ ఎండింగ్ తండ్రీ కొడుకుల మధ్య మరింత ఎమోషనల్‌గా ఉంటుందని ఊహిస్తే మాత్రం అక్కడ డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా సూపర్ సుబ్బు అడల్ట్ కంటెంట్ అయినా కూడా క్లీన్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. పెద్ద ట్విస్టులు ఏమీ ఉండకపోయినా.. హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. మరీ ఎక్కువ ఆశించి సిరీస్ స్టార్ట్ చేస్తే మాత్రం నిరుత్సాప పడే ఛాన్స్ ఉంటుంది.