తెలంగాణలోట్రాఫిక్ కు కొత్తబ్యూరో.. రద్దీ నియంత్రణకు
తెలంగాణలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు మరింత సమగ్ర రూపం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సైబర్ నేరాల నియంత్రణకు టీజీసీఎస్బీ, మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో (టీమార్స్) పేరుతో ఈ కొత్త విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ట్రాఫిక్ విభాగాలు ఆయా పోలీస్ యూనిట్ల పరిధిలోనే పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణకు ఒకే విధమైన విధానం, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించేలా టీమార్స్ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనల దస్త్రానికి ఆమోదం లభిస్తే కొత్త బ్యూరో ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణంగా మారాయి. ఏటా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణ, బ్లాక్స్పాట్ల గుర్తింపు, రోడ్ల భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరమైన ప్రాంతాల్లో మార్గాల మార్పులు, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదల వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తున్నప్పటికీ.. మరోవైపు సిగ్నళ్లు సరిగా పనిచేయకపోవడం, జీబ్రా క్రాసింగ్లు, స్టాప్ లైన్లు చెరిగిపోవడం, రోడ్లపై గుంతలు వంటి సమస్యలపై పోలీస్ శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. మున్సిపల్, ఆర్అండ్బీ తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ఇందుకు కారణంగా అధికారులు గుర్తించారు.కొత్త బ్యూరోకు అవసరమైన నిధుల కోసం ట్రాఫిక్ చలానాల ఆదాయంలో కొంత భాగాన్ని కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏటా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు చలానాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది
