
ఆడపిల్లలకే కాదు.. మగపిల్లలకు కూడా ఈ పనులు నేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య, ఆహారం, కనీస అవసరాలు అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్లలకు కొన్ని పనులను నేర్పిస్తారు. మగపిల్లలకు ఆ పనులతో అవసరం లేదని, అది మగవారి బాధ్యత కాదని చెబుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరినీ స్వయం సమృద్ధిగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే నేర్పించే కొన్ని పనులు మగపిల్లలకు కూడా నేర్పిస్తే వారు మనుషులుగా ఎదగడమే కాకుండా వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. చిన్న వయస్సు నుండే పిల్లలకు ఇంటి పనులలో పాల్గొనడం నేర్పించాలి. వారి గదిని సర్దుకోవడం, గిన్నెలను వాటి స్థానంలో పెట్టడం, బట్టలు మడతపెట్టడం లేదా బల్ల సర్దడం వంటి పనులు వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇంటిని చూసుకోవడం అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వంట చేయడం అనేది ఒక జీవన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. . టీ తయారు చేయడం, టిఫిన్ సిద్ధం చేయడం, సాధారణ భోజనం వండటం వంటి ప్రాథమిక వంట నైపుణ్యాలను మగపిల్లలకు కూడా నేర్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటారు. చిన్నతనం నుండే పిల్లలకు ఇతరుల పట్ల గౌరవం, ఇతరులతో సున్నితంగా ఉండటం వంటివి నేర్పించాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి, సమానత్వానికి అర్హులని కొడుకులకు నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని సానుకూలంగా తీర్చిదిద్దుతుంది. అబ్బాయిలకు తరచుగా ఏడవకూడదని, బాధపడకూడదని సలహా ఇస్తుంటారు, కానీ మానసిక