
వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతోప్రాణాలు కాపాడిన నవ వధువు
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు రావడంతో రోడ్లన్నీ నదుల్లా ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీకర వరదలు సంభవించాయి. అయితే ఈ వరదల్లో ఓ మానవీయ ఘటన జరిగింది. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ బైకర్ ప్రాణాలను ఓ నవ వధువు చాకచక్యంతో వ్యవహరించి కాపాడింది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ బైకర్ కు తన చున్నీ ఇచ్చి అతడ్ని రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నవ వధువును ప్రశంసిస్తున్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి ఓ కుటుంబం చూపిన చొరవ.. ఆ నవవధువు ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, భటియత్ జిల్లాల్లో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉప్పొంగుతోంది. దాంతో అక్కడి రోడ్లు, ఇతర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కకియారా- తునుహట్టి రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇదే సమయంలో ఆ రహదారిపై ప్రయాణిస్తున్న మామ్లా గ్రామానికి చెందిన ఓ బైకర్ వరదనీటిలో చిక్కుకుపోయాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తన ద్విచక్ర వాహనంతో పాటు కొద్ది దూరం కూడా కొట్టుకుపోయాడు. ఇక అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టును పట్టుకుని వరదనీటిలోనే నిలబడిపోయాడు.అదే సమయంలో ఓ కుటుంబం అప్పుడే పెళ్లి వేడుకలను ముగించుకుని అటుగా వెళ్తోంది. అయితే వరదలో చిక్కుకున్న ఆ బైకర్ ను చూసి ఆ కుటుంబం చలించింది. వెంటనే తమ కారును ఆపి అందులోని ఓ వ్యక్తి బైకర్ ను కాపాడేందుకు ముందుకు వెళ్లాడు. అయితే నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా ముందుకు వెళ్లడం ఇబ్బందిగా మారింది.దాంతో కారులో ఉన్న నవ వధువు వెంటనే సమయస్ఫూర్తిని ప్రదర్శించింది.


