
© 2026 nimisham.in

Thatipaka Krishnaswamy | మాస్ మాహరాజ రవితేజ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో అయ్యప్ప స్వామి భక్తి, పూజల నేపథ్యంతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా.. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఈ సినిమా ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విశేషాన్ని దర్శకుడు పంచుకున్నారు. ఈ చిత్రంలో అయ్యప్ప స్వామి మాలధారణ, పడి పూజలు మరియు ఇతర సాంప్రదాయ విషయాలను అత్యంత నియమనిష్టలతో, సహజసిద్ధంగా చూపించడానికి తాటిపాక కృష్ణస్వామి గారు చిత్ర బృందానికి ఎంతో సహాయపడ్డారని శివ నిర్వాణ తెలిపారు. ఆయన గురించి దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. “మా సినిమా కథా నేపథ్యం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష అనుభవం ఉన్న ఒక గొప్ప గురుస్వామి మార్గదర్శకత్వం మాకు అవసరమైంది. ఆ సమయంలోనే మాకు తాటిపాక కృష్ణస్వామి గారు దొరికారు. ఆంధ్రప్రదేశ్‌లో అయ్యప్ప భక్తులలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. ఈ సినిమా కోసం పడి పూజలు ఎలా నిర్వహించాలి, మాలధారణ సమయంలో పాటించాల్సిన నియమాలు, పద్ధతులు ఏమిటనే విషయాల్లో ఆయన దగ్గరుండి సమస్త బాధ్యతలను చూసుకున్నారు. చిత్ర బృందానికి అన్ని తానే అయి నడిపించిన కృష్ణస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని కొనియాడారు. కృష్ణస్వామి గారి మార్గదర్శకత్వంలో తెరకెక్కిన సన్నివేశాలు అయ్యప్ప భక్తులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చిత్రబృందం ఈ సందర్భంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలో జన్మించిన కృష్ణస్వామి (ఆంధ్ర జేసుదాస్) అయ్యప్ప భక్తులందరికీ సుపరిచితులు. పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారికి తాను జన్మించిన గ్రామమైన తాళ్ళపాక ఇంటి పేరయినట్టుగానే, ప్రస్తుతం తాను పుట్టిన ఊరు పేరుతోనే ఆయన ‘తాటిపాక కృష్ణస్వామి’గా పిలవబడుతున్నారు. ఈయన పేరు వింటేనే ఎంతోమంది అయ్యప్ప స్వామిల మదిలో ఆయన పాడే పాటలు గుర్తుకు వస్తాయి. ఆయన భజన ఒక్కసారి వింటే చాలు మనసులో ఎక్కడలేని భక్తి భావాలు కలుగుతుంటాయి. తెలుగు, తమిళం, మలయాళం – ఇలా మూడు భాషల్లోనూ అయ్యప్ప స్వామి పాటలను అద్భుతంగా పాడగల నైపుణ్యం ఆయన సొంతం. ఇప్పటివరకు ఏకంగా 41 సార్లు అయ్యప్ప స్వామి మాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ధరించిన అనుభవం కలిగిన గొప్ప గురుస్వామి ఆయనది.
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






