
Hanuman Ansh | భక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన చిన్న సినిమా ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం మరియు బోధనల ఆధారంగా కేవలం రూ. 2 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన తొలి రోజు కేవలం రూ. 10 లక్షలతో ప్రారంభమైన ఈ సినిమా, మౌత్ టాక్ ద్వారా అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ పోయి బడ్జెట్‌కు దాదాపు 100 రెట్లు లాభాలను ఆర్జించి, తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఈ స్థాయి రికార్డు సృష్టించిన అత్యంత చిన్న భారతీయ చిత్రంగా నిలిచింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మిర్జాపూర్: ది మూవీ’ మరియు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ‘హైవాన్’ వంటి పెద్ద చిత్రాలను సైతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టడం విశేషం. ఆరు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ థియేటర్లలో ఈ చిత్రానికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. తల్లి మరణం తర్వాత జీవితం, మరణం గురించిన నిజాలను వెతుకుంటూ ఉత్తర భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించి, చివరికి ప్రముఖ సన్యాసి నీమ్ కరోలీ బాబాగా మారిన ఒక యువకుడి హృద్యమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.





