
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Masala Mafia: హైదరాబాద్ మహానగర పరిసరాల్లో కల్తీ ఆహార పదార్థాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగర ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువుల్లోనూ, మసాలా దినుసుల్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ విభాగం బృందం కల్తీ కేటుగాళ్ల ఆట కట్టించారు. హైదరాబాద్ పరిసరాల్లోని కిరాణా దుకాణాలకు సరఫరా అవుతున్న మసాలా దినుసులు, నిత్యావసరాలు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎక్కడ తయారు చేస్తున్నారనే అంశాలపై నిఘాపెట్టారు.
బాలాపూర్, మైలార్ దేవ్ పల్లిలో నకిలీ మసాల గోడౌన్స్.. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ గోడవున్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కల్తీకి వాడుతున్న పదార్థాల రంగులు, మెరుపు కోసం ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, పారిశ్రామిక రంగులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. మసాలా దినుసులు నాణ్యంగా ఉన్నట్లు మెరిసేందుకు షైనింగ్ పౌడర్ , రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నట్లు గుర్తించారు. మసాలా దినుసుల్లో రసాయన కల్తీ పదార్థాల వల్ల క్యాన్సర్, కాలేయం, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదముందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
కల్తీ మసాలా దినుసుల తయారీ స్థావరాల్లో తనిఖీలు.. ఒక ప్రాసెసింగ్ యూనిట్లో నకిలీ ఆవాల నిల్వలను వాటి రూపాన్ని, బరువును, పరిమాణాన్ని కృత్రిమంగా పెంచడానికి ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్ ,నూనె కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి మసాలా దినుసులకు ప్రకాశవంతమైన, ప్రీమియం రూపాన్ని ఇవ్వడానికి సింథటిక్ రంగులతో పూత పూసినట్లు సమాచారం. షాజీరా, అజ్వైన్, ఇతర ముఖ్యమైన మసాలా దినుసులలో శాశ్వత పారిశ్రామిక రంగులను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే పద్ధతులను నివారించడం, ఆహార వ్యాపారాలు భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడటమే ఈ చర్యల లక్ష్యమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు.
నిత్యావసరాలు, మసాలా దినుసులకు రసాయనాలతో కల్తీ.. మసాలా దినుసుల ఉత్పత్తుల రంగు, మెరుపు, బరువు , పరిమాణాన్ని మెరుగుపరచడానికి, వాటిని అధిక ధరలకు అమ్మి సులభంగా లాభాలు సంపాదించడానికి ఈ పదార్థాలను ఉపయోగిస్తున్నారని పోలీసు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. మసాలా దినుసుల తయారీలో కృత్రిమ నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగుల ఆహార రంగులు, శాశ్వత పారిశ్రామిక రంగులు, వస్త్రాల రంగులు, టాల్కమ్, షైనింగ్ పౌడర్, రైస్-బ్రాన్ ఆయిల్‌ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాసెసింగ్ యూనిట్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. వాము, జీలకర్ర, లవంగాలు కల్తీ చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 13 స్థావరాల్లో నిల్వ ఉంచిన మసాలా దినుసులు, సుమారు 25వేల కిలోల ప్రమాదకర కల్తీ మసాలా దినుసులు, 89 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పదార్థాలను తయారు చేసే స్థావరాల్లో ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో రాహుల్ భాటి, విశాల్ పన్వార్, దులీచంద్ కచ్ఛవార్ ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మసాలా దినుసులు కల్తీకేటుగాళ్ల ఆటకట్టించిన హెచ్ ఫాస్ట్..
హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మసాలాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ, నీళ్ల ప్యాకెట్ల రూపకల్పనపై చర్యలు తీసుకున్నారు. 83 నెయ్యి దుకాణాలను, 46 పనీర్ దుకాణాలను కూడా తనిఖీ చేయగా, ఆన్లైన్లో వచ్చిన 96 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించారు. హెచ్ ఫాస్ట్ అధికార బృందం హైదరాబాద్ నగర పరిసరాల్లో గత 140 రోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.
659 ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లు, 202 ఎఫ్ఐఆర్లు నమోదు.. 659 ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్లు నిర్వహించారు. 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కల్తీ , కలుషితమైనట్లు అనుమానించిన 2లక్షల 46వేల 822 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. 232 కేసులను చట్టపరమైన చర్యల కోసం ఆహార భద్రతా అధికారులకు నివేదించారు. ఒక ప్రధానమైన పరిశోధనలో, అధికారులు తొక్క తీయని, కుళ్లిన పదార్థాలు, టైటానియం డయాక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను ఉపయోగించి తయారు చేసినట్లు గుర్తించిన 27వేల కిలోలకు పైగా అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 12 టన్నులకు పైగా కుళ్ళిన మాంసం, 60 టన్నుల కోడి వ్యర్థాలు కూడా అపరిశుభ్రమైన పరిస్థితులలో గుర్తించి ఆ స్థావరాలను సీజ్ చేశారు.
ఆహార కల్తీతో ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. పౌరుల ఆరోగ్య భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తామన్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించిన సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర పౌరులకు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





