
ప్రస్తుతం తమిళనాడు థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా మందాడి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో తమిళ హాస్యనటుడు, హీరో సూరితోపాటు తెలుగు యంగ్ హీరో సుహాస్ సైతం నటించారు. అయితే ఇన్నాళ్లు కామెడీ పాత్రలతో అలరించిన సూరికి ఈ చిత్రం నటుడిగా మంచి మార్కును తెచ్చిపెట్టింది. అలాగే చిన్న చిన్న సినిమాలతో జాతీయ అవార్డ్ దృష్టిని ఆకర్షించిన సుహాస్.. ఈ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా సూరి, సుహాస్ నటనపై అడియన్స్, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన మడిమారన్ పుగళెంతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్, సత్యరాజ్, సుహాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసింది.