
ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో శనివారం గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే (abhijeet dipke)కు ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. ఆ ఘటనపై దీప్కే స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం (Madhya Pradesh Government)పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొందరు వ్యక్తులు తనను ముఖ్యమంత్రిగా భావించి, విమర్శించారని అన్నారు. అందుకుగానూ పిల్లల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ.. మధ్యప్రదేశ్‌ సీఎంగా రాజీనామా చేస్తున్నా’నంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘నేను తక్షణమే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీజీకి ధన్యవాదాలు. అయితే, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. బాలాఘాట్‌లో 30మందికి పైగా గిరిజన పిల్లల (Tribal Children) మరణాల తర్వాత, ఈ పదవిలో కొనసాగడానికి నా అంతరాత్మ అంగీకరించట్లేదు’’
‘‘బాధిత కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ఇస్తామని మొదట ప్రకటించాం. పిల్లల మరణాలను ప్రశ్నిస్తూ.. గిరిజన వర్గాలు నిరసన చేపట్టడంతో ఆ పరిహారాన్ని రూ.4లక్షలకు పెంచాము. అదే చనిపోయిన పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలై ఉంటే ఇంతే మొత్తాన్ని చెల్లించేవారిమా? చిన్నారుల మరణానికి కారణమైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. బాలాఘాట్ గిరిజనులకే కాకుండా రాష్ట్రంలోని గిరిజనులందరికీ నేను అన్యాయం చేశాను. అందువల్లే ఈ పదవిలో కొనసాగే నైతిక హక్కు నాకు ఉందని భావించట్లేదు’ అని దీప్కే సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






