
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
PCB Bans Pakistan Cricketers: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జాంబియాలో నిర్వహించిన అనధికారిక టీ20 లీగ్‌లో పాల్గొన్నందుకు పలువురు మాజీ పాకిస్థాన్ క్రికెటర్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. జాంబియా రాజధాని లుసాకా వేదికగా 'ఏషియన్ లెజెండ్స్ లీగ్' పేరిట ఆగస్టు 2 నుంచి ఒక టీ20 టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఇందులో ఏషియన్ స్టార్స్, పాకిస్థాన్ పాంథర్స్, అఫ్గానిస్థాన్, శ్రీలంక పేర్లతో జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు గతేడాది నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్, వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్, ఆల్‌రౌండర్ సొహైల్ తన్వీర్, ఆఫ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్ తదితరులు లుసాకా వెళ్లారు. అయితే లీగ్ వివరాలను ఆరా తీయగా.. దీనికి జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లేదని తేలింది. ఈ విషయాన్ని జాంబియా క్రికెట్ యూనియన్ స్వయంగా ధృవీకరించింది.
ఈ టోర్నమెంట్లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఆడాల్సి ఉంది. అయితే అధికారిక గుర్తింపు లేదని తెలుసుకున్న రాయుడు.. జాంబియా నుంచి వెనక్కి వచ్చాడు. రాయుడితోపాటు పాక్ ఆటగాళ్లు మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి కొందరు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెంటనే స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్, యాసిర్ షా, హసన్ రజా, రాహత్ అలీ, మహమ్మద్ ఇర్ఫాన్, యాసిర్ భట్, అబ్రార్ హుస్సేన్, రాణా అన్వర్ వంటి మరికొందరు మాజీ పాకిస్థాన్ ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లు ఆడారు. జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) జోక్యం తర్వాత టోర్నమెంట్‌ను నిలిపివేశారు.
ఈ టోర్నమెంట్ ప్రారంభమైన కొద్దిరోజులకే నిర్వాహకులు బ్రాడ్కాస్ట్ అగ్రిమెంట్లు పూర్తి చేయడంలో విఫలమయ్యారు. ప్రయాణ, వసతి ఖర్చులు కూడా చెల్లించలేదు. దీంతో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది లుసాకాలో చిక్కుకుపోయారు. నిర్వాహకులు బిల్లులు చెల్లించకపోవడంతో ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం పాకిస్థాన్ క్రికెటర్లకు గదులు కేటాయించేందుకు నిరాకరించింది. ఆటగాళ్లకు ఇస్తామన్న పారితోషికం ఇవ్వకపోగా.. విమానాశ్రయంలో కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. మాజీ పాకిస్థాన్ ఆటగాళ్లు ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో పాల్గొన్న విషయం తెలుసుకున్న పీసీబీ.. వారిపై రెండేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. ఆటగాళ్లు అవసరమైన నిరభ్యంతర పత్రం (NOC) పొందలేదని బోర్డు వెల్లడించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పాక్ ఆటగాడు మాట్లాడుతూ.. ఏజెంట్లు తమను తీవ్రంగా మోసం చేశారని.. జాంబియా క్రికెట్ బోర్డు అనుమతి ఉందని, భారీ మొత్తంలో పారితోషికం వస్తుందని నమ్మించారని వాపోయాడు. తమకు రూపాయి కూడా దక్కకపోగా.. హోటళ్లలో గదులు ఇవ్వక తీవ్ర అవమానానికి గురై ఖాళీ చేతులతో తిరిగి రావలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పీసీబీ విధించిన నిషేధంతో మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లపై రెండేళ్ల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు.
పీసీబీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేయనున్న ఆటగాళ్లు
ఈ నిషేధం తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని, ఆర్థికంగా తీవ్ర నష్టం చేకూరుస్తుందని నిషేధానికి గురైన ఆటగాళ్లు భావిస్తున్నారు. ఏజెంట్ల మోసానికి గురయ్యామని.. తమపై కొంత దయ చూపి నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పీసీబీ (PCB) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీని కలవడానికి రెడీ అవుతున్నారు. మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన సహచరులకు మద్దతుగా నిలిచాడు. "ఈ లీగ్‌లో భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. కానీ ఏ బోర్డు కూడా వారిపై ఇటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. క్రికెట్ మాత్రమే ఈ ఆటగాళ్లకు జీవనోపాధి. పీసీబీ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి"* అని అక్మల్ కోరాడు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పుట్టుకొస్తున్న అనధికారిక, అక్రమ టీ20 ఫ్రాంచైజీ లీగ్స్‌ను అరికట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రంగంలోకి దిగింది. లీగ్స్‌ను పర్యవేక్షించడానికి, ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) క్యాలెండర్‌తో సమన్వయం చేయడానికి 'ఫ్రాంచైజీ లీగ్స్ కమిటీ' (Franchise Leagues Committee)ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ నూతన కమిటీకి బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఛైర్మన్‌గా నియమించారు.





