
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడటం కోసం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన భారత్.. సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 1 ఫోర్‌తో 15 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టిన సిరాజ్.. లాస్ట్ ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదడం విశేషం.వార్మప్ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో భారత్ విజయానికి 207 పరుగులు అవసరం అయ్యాయి. మ్యా్చ్ చివరి రోజు ఫైనల్ ఓవర్ ప్రారంభమయ్యే సరికి భారత్ 191/4తో నిలిచింది. టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. సిరాజ్‌తోపాటు ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ సింగిల్ తీసిస్తే.. మ్యాచ్‌ను ముగించాలని సారాంశ్ భావించి ఉంటాడు. కానీ సిరాజ్ మియా మాత్రం మరోలా ఆలోచించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అప్పటికే భారత జట్టు గెలిచింది. కానీ వార్మప్ మ్యాచ్‌ల్లో పెద్దగా రూల్సేమీ ఉండవు కాబట్టి.. ఆ ఓవర్ ముగించడం కోసం శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ నువాంతా బౌలింగ్ కొనసాగించాడు. నాలుగో బంతికి వదిలేసిన సిరాజ్.. ఐదో బంతిని బౌండరీగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. అంతకు ముందు దినుష వేసిన ఓవర్లోనూ సిరాజ్ ఓ సిక్సర్ బాది తన సత్తా ఏంటో చాటాడు.‘లార్డ్స్’ ఓటమితో సిరాజ్‌లో పెరిగిన కసి..2025 జులైలో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయానికి 22 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లాండ్ గెలవడానికి ఒక వికెట్ అవసరమైంది. ఈ ఇన్నింగ్స్‌లో పదకొండో నంబర్ బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్.. రవీంద్ర జడేజాకు సహకరిస్తూనే పట్టుదలతో బ్యాటింగ్ చేసి 30 బంతులను ఎదుర్కొన్నాడు. అయితే స్పిన్నర్ బషీర్ వేసిన బంతి అనూహ్యంగా వికెట్లను తాకడంతో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. ఓటమితో సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో సిరాజ్‌లో కసి పెరిగింది. తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెట్టి, పట్టుదలతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ హైదరాబాదీ.. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది తనెంటో నిరూపించుకున్నాడు. లార్డ్స్ పిచ్ మీద స్పిన్నర్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔటైన సిరాజ్.. ఇప్పుడు స్పిన్నర్లకు స్వర్గధామం లాంటి శ్రీలంక పిచ్‌ల మీద లంక స్పిన్నర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. వార్మప్ మ్యాచ్ విశేషాలు..కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన శ్రీలంక క్రికెట్ ఎలెవన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మదుష్క (66), రవిందు రసంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) హాఫ్ సెంచరీలు సాధించడంతోపాటు.. మిగతా బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైశ్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 రన్స్ చేశాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ 164 బంతుల్లో 142 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. మరో లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లు పంత్ (2), జురెల్ (1) నిరాశపర్చారు. మానవ్ సుథార్ 41 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. 11వ నంబర్ బ్యాటర్ గుర్నార్ బ్రార్ (18 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైశ్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 46 బంతుల్లో 61 పరుగులు చేశాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడని శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 44 రన్స్ చేశాడు. వేగంగా ఆడే రిషభ్ పంత్.. తన సహజ శైలికి భిన్నంగా 68 బంతుల్లో 28 రన్స్ చేయగా.. జురెల్ 20 బంతుల్లో 17 రన్స్ చేశాడు. ఆఖర్లో సిరాజ్ మియా మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు. భారత జట్టు చివరిసారిగా2017లో కోహ్లి సారథ్యంలో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ ఆడగా.. మళ్లీ ఇప్పుడు గిల్ నాయకత్వంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది.






