
5.14 గంటల్లోనే సరస్సు దాటి రికార్డు మన్ననలు అందుకుంటున్న పారా స్విమ్మర్‌ ఏలూరు నగరం, న్యూస్‌టుడే: వైకల్యానికి కుంగిపోలేదు. దాన్ని సవాల్‌గా తీసుకొని.. డీఎస్సీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. తాజాగా యూరప్‌లోని ప్రముఖ బోడెన్సీ సరస్సును అతి తక్కువ సమయంలోనే ఈది సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయనే ఏలూరు నగరానికి చెందిన అంతర్జాతీయ పారా స్విమ్మర్, స్విమ్మింగ్‌ శిక్షకుడు బలగ గణేశ్‌. జర్మనీ-స్విట్జర్లాండ్‌ మధ్యనున్న సరస్సు ఈదిన తొలి భారతీయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఘనత సాధించారు. క్రీడా కోటాలో కొలువు.. ఏలూరు శాప్‌ శిక్షణ కేంద్రంలో ఈత శిక్షకుడిగా బలగ గణేశ్‌ సుమారు పదేళ్లకు పైగా పని చేశారు. 150 మందికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దారు. మెగా డీఎస్సీ-2025లో పారా స్విమ్మింగ్‌ క్రీడా కోటా కింద ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌) కొలువు సాధించారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత తులసి చైతన్య మోతుకూరి వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. గడ్డకట్టే చలిలో.. ఐరోపాలో మూడో అతిపెద్ద సరస్సుగా బోడెన్సీ పేరొందింది. జర్మనీలోని ఫ్రెడ్రిష్‌షాఫెన్‌ నుంచి స్విట్జర్లాండ్‌లోని రోమాన్స్‌హార్న్‌ వరకు సుమారు 12 కి.మీ. దూరాన్ని.. కేవలం 5.14 గంటల్లోనే ఈది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16.5 డిగ్రీల శీతల వాతావరణంలో.. వెట్‌సూట్‌ ధరించకుండానే సాహసోపేతంగా ఈదడం గమనార్హం. మంత్రి లోకేశ్‌ అభినందనలు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన గణేశ్‌ను మంత్రి నారా లోకేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని కొనియాడారు. అమరావతిలో శాప్‌ ఎండీ భరణి నుంచి బుధవారం గణేశ్‌ ప్రశంసాపత్రం అందుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





