
కార్యరూపం దాల్చని రెగ్యులేటర్ల నిర్మాణం పెదఎడ్లగాడి వద్ద వెలవెలబోతున్న కొల్లేరు కలిదిండి, కైకలూరు, న్యూస్‌టుడే : కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణలో భాగంగా మూడు చోట్ల రెగ్యులేటర్లు నిర్మిస్తామంటూ వైకాపా 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోయింది. కూటమి ప్రభుత్వంలోనైనా కల సాకారం అవుతుందనే ఆశతో ప్రకృతి ప్రేమికులతోపాటు కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల ప్రజలు.. రైతులు ఎదురు చూస్తున్నారు. ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరు కొన్నేళ్ల కిందట తాగునీటి వనరుగా ఉపయోగపడేది. ఇందులోని మత్స్య సంపదతో మత్స్యకారుల జీవితాలు పచ్చగా ఉండేవి. సముద్రంలోని నీరు ఏరులో కలవడం, ఉప్పుటేరుకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో రొయ్యల చెరువులు విస్తరించడంతో ఏటిలోని నీరు ఉప్పుమయం కావడంతో మత్స్య సంపద అంతరించిపోతోంది. రెగ్యులేటర్ల నిర్మాణంతో ఉప్పు శాతం తగ్గించవచ్చు. దీంతో మత్స్య జాతులు ఊపిరి పోసుకుంటాయి. మత్స్యకారులకు ఉపాధి దొరకడంతోపాటు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 77,138 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏటా వర్షాకాలంలో 64 చిన్నా, పెద్దా డ్రెయిన్ల నుంచి వరద నీరంతా కొల్లేరులో నిలవకుండా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతోంది. దీంతో ఇక్కడ ఉండే పక్షి జాతులు, మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోంది. రెగ్యులేటర్ల నిర్మాణంతో సరస్సులో నీటి నిల్వలు పెంచుకోవచ్చు. మరోవైపు ఉప్పుటేరులోని ఉప్పు నుంచి ముప్పు తప్పుతుంది. దీంతో పక్షి జాతుల సంరక్షణతోపాటు కొల్లేరు వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం వస్తుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే, కైకలూరు ఉప్పుటేరు పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాం. కొల్లేరు, ఉప్పుటేరును సంరక్షించుకోవడానికి రెగ్యులేటర్లు బాగా ఉపయోగపడతాయి. మూడు జిల్లాలకు ఉపయోగపడే ఈ అంశాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





