
వరంగల్‌ కార్పొరేషన్‌: వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, సీడీఎంఏ డా. టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ నగర యూజీడీ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. హనుమకొండ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయ్, కమిషనర్ టి. వెంకన్న పాల్గొని ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, చేపట్టిన చర్యలను సీడీఎంఏకు వివరించారు. ఈ సందర్భంగా సీడీఎంఏ మాట్లాడుతూ, యూజీడీ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేసి, పనులను వేగవంతంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత మార్గదర్శకాలు, సాంకేతిక ప్రమాణాలు, సంబంధిత నివేదికలను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నగర పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణను మెరుగుపరచడంతో పాటు నగర సమగ్ర అభివృద్ధికి యూజీడీ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొంటూ, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులో పనులు ప్రారంభించి, నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సీడీఎంఏ ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి టెండర్ల ఆహ్వానానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సీడీఎంఏకు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్, ఇన్‌ఛార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఈఈలు రవి కుమార్, సంజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ కార్తీక్ రెడ్డి, టీపీఎస్ అవినాష్ తదితర అధికారులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.