
UK Breakup| ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని.. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఒకప్పుడు వెలుగొందిన యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రభ మసకబారిపోతోంది. ఇప్పుడు యూకేలో భాగమైన దేశాలు కూడా బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు వేల్స్‌ (Wales), స్కాట్‌లాండ్‌ (Scotland), నార్తర్న్ ఐర్లాండ్‌ (Northern Ireland) దేశాల ప్రతినిధులు తాజాగా సంతకాలు చేశారు. ప్రస్తుతం మనకు తెలిసిన బ్రిటన్‌, యూకే పేర్లు కొన్ని దేశాల సమాహారంగా వచ్చాయి. ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్, వేల్స్ కలిసి గ్రేట్‌ బ్రిటన్‌. వీటికి నార్తర్న్ ఐర్లాండ్‌ కూడా కలిస్తే యునైటెడ్ కింగ్టమ్ (UK). ఇప్పుడు ఈ యూకే నుంచి బయటపడి, పూర్తి స్వయం ప్రతిపత్తిగల దేశాలుగా ఉండాలని వేల్స్‌, స్కాట్‌లాండ్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ కోరుకుంటున్నాయి. అదే జరిగితే ఆ రాజ్యంలో ఇంగ్లాండ్ ఒకటే మిగులుతుంది (UK Breakup). రాజ్యాంగ మార్పునకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్ ఐరోపా యూనియన్‌తో ముడిపడి ఉందని ఆ మూడు దేశాల ఫస్ట్‌ మినిస్టర్లు.. యూకే ప్రధాని ఆండీ బర్నహామ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశారు. వెస్ట్‌మినిస్టర్ (బ్రిటన్ పార్లమెంట్, ప్రభుత్వానికి కేంద్రస్థానం) సమయం ముగింపు దశకు వచ్చిందనడానికి ఇంతకు మించిన సంకేతం లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రాజధాని నగరం డబ్లిన్‌లో మాట్లాడుతూ.. అవిభాజ్య ఐర్లాండ్‌ను చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అది ఎప్పటికైనా జరగాల్సిందే.. ఇప్పుడే జరిగితే మంచిదంటూ వివాదస్పద అంశాన్ని మరోసారి లేవనెత్తారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే అవగాహన ఒప్పందంపై మూడు దేశాలు సంతకాలు చేయడం గమనార్హం. వంద సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ఐర్లాండ్ స్వాతంత్ర్యం పొందింది. అందులో నార్తర్న్ ఐర్లాండ్ యూకేలో ఉండిపోయింది. మరొక భాగం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌ స్వతంత్ర దేశంగా మారింది. ఈ ఫస్ట్‌ మినిస్టర్ల వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం స్పందించింది. ప్రధాని యూకే ఐక్యతనే విశ్వసిస్తున్నారని చెప్పింది. రాజ్యాంగపరమైన అంశాల్లో చర్చల కంటే ప్రజల జీవన వ్యయాలను తగ్గించడంపైనే ఆయన ప్రధానంగా దృష్టిసారించారని పేర్కొంది. గతంతో పోలిస్తే తమ యూనియన్‌కు ముప్పు ఎక్కువగా ఉందని అనుకోవడం లేదని వ్యాఖ్యానించింది. తమ సంస్కృతులను కాపాడుకునేలా సొంత నిర్ణయాలు తామే తీసుకోవాలని స్కాట్‌లాండ్ (Scotland), వేల్స్‌ (Wales), నార్తర్న్ ఐర్లాండ్ (Northern Ireland) ప్రజలు భావిస్తున్నారు. వెస్ట్‌మినిస్టర్ విధానాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేవని అనుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.