
షికారుగంజి వద్ద లారీని ఢీకొన్న ఆటో ముగ్గురి మృతితో తీవ్ర విషాదం దత్తిరాజేరు, బాడంగి, న్యూస్‌టుడే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, స్థానికులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ముగ్గురి జీవితాలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు చిదిమేసింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. దత్తిరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద 26వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. డీఎస్పీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన గుణుపూరు తిరుపతి(38), తెర్లి ఆదినారాయణ(63) విజయనగరంలో మొక్కజొన్న కండెలు విక్రయించి ఆదివారం వేకువజామున ఆటోలో ఇంటికి బయలుదేరారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన ఎండు చేపల వ్యాపారి గుడ్ల రాము(45) మార్గమధ్యలో ఈ ఆటో ఎక్కారు. షికారుగంజి కూడలి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురూ మృతిచెందారు. డీఎస్పీ గోవిందరావు, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌.బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేశారు. ఆదినారాయణ జేబులో ఉన్న రూ.14,950 నగదును అతని కుమారుడు కిశోర్‌కు అప్పగించారు. ఇల్లు కట్టుకున్నారు.. ఇంతలోనే.. ఆదినారాయణకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు కిశోర్‌ మర్చంట్‌ నేవీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే నూతన ఇంటిని నిర్మించారు. మంచిరోజు చూసుకుని గృహ ప్రవేశం చేయాల్సి ఉండగా ఈలోగా విషాదం నెలకొంది. రాము (పాతచిత్రం), గుణుపూరు తిరుపతి, తెర్లి ఆదినారాయణ ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మరణించడంతో గజరాయునివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మృతదేహాలు గ్రామ చివర ఉన్న చెరువు వద్దకు తీసుకురావడంతో కడసారిగా చూసేందుకు బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. గుణుపూరు తిరుపతి వ్యవసాయం చేయడంతో పాటు ఆటో నడుపుతారు. భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు దివ్య(7వ తరగతి), హేమంత్‌ కుమార్‌(5వ తరగతి), తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలం ఉన్నారు. కుటుంబానికి ఈయనే ప్రధాన ఆధారం. తిరుపతి బావమరిది ధనుంజయ్‌ ద్విచక్ర వాహనంపై విశాఖ నుంచి వస్తూ బావ మరణవార్త విని సొమ్మసిల్లి పడిపోవడంతో అతనికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతిచెందిన గుడ్ల రాము స్వస్థలం పెదమానాపురం. భార్య యల్లయ్యమ్మ, కుమార్తెలు భవాని(డిగ్రీ) దేవి(10వ తరగతి) ఉన్నారు. వీరిది నిరుపేద కుటుంబం. ఈయన ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఎండు చేపలు పట్టుకుని గ్రామాల్లో విక్రయించేందుకు వెళ్తుంటారు. రాము మరణంతో తమ కుటుంబానికి దిక్కెవరంటూ భార్య, పిల్లలు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఆదినారాయణ ఇంటివద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





