
నగరంలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో తీవ్ర తాగునీటి కష్టాలు ఫ్లాట్ల కొనుగోలులోఆచితూచి అడుగులేయడం ఉత్తమం తాగునీటి కోసం ఎండాడ రిజర్వాయరు వద్ద ఇటీవల నిరసన తెలిపిన ప్రజలు న్యూస్‌టుడే, మధురవాడ: ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన నగర వాసులు ‘గేటెడ్‌ కమ్యూనిటీ’ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఎత్తయిన ప్రహరీలు, వ్యాయామశాలలు, క్లబ్‌ హౌస్‌లు, రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్‌పూల్‌ వంటి వసతులు చూసి మురిసిపోతున్నారు. ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ చూసి సామాన్యుల నుంచి విద్యావంతులు వరకు కళ్లు మూసుకుని భారీగా వ్యయం చేసి ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి అన్ని అనుమతులు సక్రమంగా వచ్చాయా? లేదా?, బల్క్‌వాటర్‌ ఛార్జీలు చెల్లించారా తదితర విషయాలు విస్మరిస్తున్నారు. అసలు వాస్తవాలను తెలుసుకోకుండా అడుగులు వేస్తే ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తాజాగా మధురవాడలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసితులు పడుతున్న తాగునీటి ఇబ్బందులే ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే క్రమంలో పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనపై అధికార యంత్రాంగం చూపకపోవడం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. యంత్రాంగం తీరు విచారకరం: గేటెడ్‌ కమ్యూనిటీలకు నిర్మాణ అనుమతులిచ్చి ఆక్యుపెన్సీ ధ్రువపత్రాలు (ఓసీ) జారీ చేసి క్రమం తప్పకుండా ఇంటి పన్నులు వసూలు చేస్తున్న జీవీఎంసీ కనీస మౌలిక వసతుల్లో ఒకటైన ‘బల్క్‌ వాటర్‌ కనెక్షన్‌’ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా వందలాది కుటుంబాలు కేవలం బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో బోర్లు ఎండిపోయి రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధురవాడలోని ఓ భారీ గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాట్లను యజమానులకు అప్పగించే ముందు నిర్మాణదారుడు సుమారు రూ.2 కోట్ల బల్క్‌ వాటర్‌ ఛార్జీలు జీవీఎంసీకి చెల్లించాల్సి ఉన్నా కేవలం రూ.50 లక్షలు కట్టి చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కనెక్షన్‌ అనుమతులకు ఒక్కో ఫ్లాట్‌ యజమాని తమ జేబుల నుంచి రూ.20 వేల చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చినా యంత్రాంగం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ గేటెడ్‌ కమ్యూనిటీలో 25కిపైగా బోర్లు ఉన్నా అవన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం ట్యాంకర్లు పంపి తాగునీటి అవసరాలను కొంత మేర తీరుస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





