
ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: యువ పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్‌ విశాఖ జోన్‌ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్‌లో చేపట్టిన ఎక్స్‌పో ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తున్న ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పి.భాస్కర్‌రావు, కార్యదర్శి సుబ్బారావు, విశాఖ జోన్‌ ఛైర్మన్‌ శోభన్‌ ప్రకాష్‌ ఇతర ప్రతినిధులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు: జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందజేస్తామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ వెల్లడించారు. ఇలాంటి ఎక్స్‌పోలు విశాఖ వేదికగా మరిన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. క్రెడాయ్, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు 10 ఎకరాల స్థలం కేటాయించి, మౌలిక వసతులు సమకూర్చాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్‌ మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికంగా మామిడి, జీడి, కొయ్యబొమ్మల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పి.భాస్కరరావు, కార్యదర్శి బి.సుబ్బారావు, విశాఖ జోన్‌ ఛైర్మన్‌ పి.శోభన్‌ ప్రకాష్‌ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్స్‌పోను సందర్శించిన హోం మంత్రి అనిత: బిజినెస్‌ ఎక్స్‌పోను హోం మంత్రి అనిత సందర్శించారు. స్టాల్స్‌లో ఉంచిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలు అందించాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులను కోరారు. ఛాంబర్స్‌ ఆప్‌ కామర్స్‌ మహిళా ప్రతినిధులతో హోంమంత్రి అనిత .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.