
రూ. 800 కోట్ల ప్రాజెక్టులకు అడ్డంకులు 3, 4 లైన్ల నిర్మాణంలో ఆలస్యం దువ్వాడ వద్ద జరుగుతున్న పనులు ఈనాడు, విశాఖపట్నం: జిల్లా పరిధిలో మూడు, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణ పనుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూసేకరణ దాదాపుగా పూర్తయినప్పటికీ పలు సమస్యలతో పనులు ముందుకు సాగడం లేదు. కొత్త మార్గాల నిర్మాణానికి రైల్వే రూ.800 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ పనుల ప్రగతికి సంబంధించి నివేదిక సమర్పించారు. ఎంతో కీలకం..: వివిధ ప్రాంతాల నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లు గమ్యానికి చేరుకోవడంలో ఆలస్యమవుతోంది. కొన్ని రైళ్లను పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్‌లో గంటకుపైగా నిలిపేయాల్సి వస్తోంది. ఆయా మార్గాల్లో మూడు, నాలుగో లైన్లు లేకపోవడమే దీనికి కారణం. రైళ్ల ఆలస్యం నివారించడం, వేగం పెంచడమే లక్ష్యంగా కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. దీని కోసం గోపాలపట్నం, పెందుర్తి, దువ్వాడ పరిసర ప్రాంతాల్లో 25 ఎకరాల భూమి సేకరించారు. ప్రాజెక్టు: విశాఖ-గోపాలపట్నం (మూడు, నాలుగో లైన్ల నిర్మాణం) విస్తీర్ణం : 15.31 కి.మీ. ప్రయోజనం : ఒకేసారి రెండు, మూడు రైళ్లు రాకపోకలు సాగించవచ్చు. నిధులు : రూ.159.47 కోట్లు ప్రస్తుత పరిస్థితి : ఇక్కడ 0.236 ఎకరాల స్థలం సేకరించి పరిహారం చెల్లించారు. భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ప్రాజెక్టు : పెందుర్తి- ఉత్తర సింహాచలం విస్తీర్ణం: 7.13 కి.మీ. మేర లైను విస్తరణ. ప్రయోజనం : పైవంతెన నిర్మాణంతో ఉత్తర సింహాచలం నుంచి దువ్వాడ వైపు సరకు రవాణా రైళ్లను ఆపకుండా పంపొచ్చు. నిధులు: రూ.183.65 కోట్లు ప్రస్తుత పరిస్థితి : పొర్లుపాలెంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు జీవీఎంసీ, జలవనరులశాఖ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉంది. ప్రాజెక్టు : వడ్లపూడి- గేట్‌ కేబిన్‌ కూడలి విస్తరణ (మూడు, నాలుగో లైన్ల నిర్మాణం) విస్తీర్ణం : 12. 5 కి.మీ. ప్రయోజనం : పోర్టు, స్టీల్‌ప్లాంట్, రైల్వే మెకనైజ్డ్‌ డిపోనకు ఉపకరిస్తుంది. నిధులు : రూ.154.28 కోట్లు ప్రస్తుత పరిస్థితి : ఇక్కడ 0.10 ఎకరాల భూసేకరణలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రాజెక్టు : దువ్వాడ-ఉత్తర సింహాచలం ( 3, 4 లైన్ల నిర్మాణం) విస్తీర్ణం : 20.5 కి.మీ. ప్రయోజనం : విజయవాడ వైపు రైళ్లను వేగంగా నడపవచ్చు. నిధులు : రూ.302.25 కోట్లు ప్రస్తుత పరిస్థితి : పలు కుటుంబాల్లో వివాదం కారణంగా పరిహారం నిధుల చెల్లింపులు నిలిచిపోయాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.