
వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాత నగరం అఫీషియల్‌ కాలనీ మూడో వీధిలో కొలువైన శ్రీ బుచ్చిరామలింగేశ్వర (వైశాఖేశ్వర) స్వామి దేవాలయంలోని ఉపాలయంలో ఆనందగణపతి పూజలందుకుంటున్నారు. భక్తుల పాలిట కొంగుబంగారమైన స్వామికి బెల్లం సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఇక్కడికి వచ్చే వారు శక్తి కొద్దీ బెల్లం దిమ్మెలు సమర్పిస్తారు. ఈ నెల 14 గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముగింపు సందర్భంగా 23న మహా అన్నదానం నిర్వహించనున్నారు. ఞపూజలు ఇలా..: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రోజూ అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు దొంతుకుర్తి శ్రీకాంత్‌శర్మ తెలిపారు. వినాయకచవితి నాడు ఉదయం 6.30 గంటలకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందన్నారు. మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని వివరించారు. స్వామి రోజుకో అలంకరణలో దర్శనమిస్తారన్నారు. స్వామి తొండం కుడివైపు ఉంటుందని.. ఇక్కడ పూజలు చేస్తే సకల కార్యక్రమాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోందని శ్రీకాంత్‌శర్మ తెలిపారు. శుభములొసగే సంపత్‌ వినాయగర్‌.. కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం నవరాత్రి వేడుకలకు సిద్ధమైంది. స్వామికి సోమవారం ఉదయం 4 గంటల నుంచి విశేష పూజలు, హోమాలు నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ఇక్కడికి ఉత్తరాంధ్ర జిల్లాలు, విదేశాల నుంచి భక్తులు తరలిస్తారు. పరీక్షల వేళ విద్యార్థులు, నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు స్వామివారి చెంత పూజలు చేస్తారు. ఞకేరళం సంప్రదాయం ప్రకారం క్రతువులు: 1962లో సంపత్‌ వినాయగర్‌ ఆలయాన్ని ఎస్‌జీ సంబంధన్‌ స్థాపించారు. 1967లో కంచి కామకోటి పీఠం జగద్గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సంపత్‌ వినాయగర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం సందర్భంగా తూర్పు నౌకాదళం అడ్మి రల్‌ కృష్ణన్‌ భారత్‌ గెలుపు కోరుతూ.. 1,001 కొబ్బరికాయలు కొట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ సబ్‌మెరైన్‌ సముద్రంలో మునిగిపోయింది. అప్పటి నుంచి ఆలయానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ దీన్ని స్థాపించిన కేరళంకు చెందిన కుటుంబ సభ్యులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి సంప్రదాయ ప్రకారం క్రతువులు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయ ఆవరణలో మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.