
భారీ డీజే శబ్దాలతో ప్రాణహాని పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు ఈనాడు, విశాఖపట్నం: శుభ కార్యమైనా, ఊరేగింపైనా డీజే ఉండాల్సిందే అనే ధోరణి నగరంలో పెరుగుతోంది. మితిమీరిన శబ్దాలు పసిపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులున్న వారికి శాపంగా మారుతున్నాయి. డీజేల శబ్దం ధాటికి గుండె లయ తప్పి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. అనుమతుల్లేని డీజేలపై పోలీసులు జరిమానా వేసి వదిలేస్తుండటంతో నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. ఓ పౌరుడి పోరాటం ఇదీ: విశాఖలో ఓ పౌరుడు చేసిన చట్ట పోరాటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా శబ్ద కాలుష్యం బాధితులకు మార్గాన్ని చూపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న అక్కయ్యపాలెం బస్‌స్టాప్‌ సమీపంలో జాతీయ రహదారిపై డీజేల మోతతో ఓ ఊరేగింపు వెళ్లింది. దీని నుంచి వచ్చిన భారీ శబ్దాలు, వెగటు పుట్టించే పాటలతో ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. దీనిపై 4వ పట్టణ స్టేషన్‌లో ఓ పౌరుడు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి డీజే సౌండ్‌ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో మితి మీరిన డీజే శబ్దాలు పెట్టినా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాలి. చట్టం ఏం చెబుతోంది: నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లు పెట్టాలంటే ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి ఉన్నప్పటికీ నిర్దేశించిన డెసిబెల్‌ పరిమితులు దాటకూడదు. డీజే శబ్దాలతో ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగిస్తే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 125 కింద పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. సమీపంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి భారీ శబ్దాలతో డీజేలు పెడుతుంటే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. డయల్‌ 100, 112కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.