
భారతదేశంలో వాహన బీమాకు చెందిన ప్రక్రియలు..మారుతున్న సాంకేతికత, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతున్నాయి. ఆన్‌లైన్‌లో పాలసీలను కొనుగోలు చేసే అవకాశాన్ని అందించడం నుంచి వేగవంతమైన క్లెయిం పరిష్కారం, కవరేజ్ ఎంపికల వరకు బీమా సంస్థలు పాలసీదారులకు మొత్తం అనుభవాన్ని సరళంగా, మరింత సౌకర్యవంతంగా మార్చడంపై దృష్టి సారిస్తున్నాయి. దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో వాహన బీమాకు సంబంధించి మరిన్ని క్రమబద్ధమైన మార్పులు రానున్నాయి. భారత్‌లో వాహన బీమా భవిష్యత్తు, అభివృద్ధి చెందుతున్న బీమా రంగ పోకడలతో పాటు నేడు వాహన బీమా నిర్వహణను ప్రభావితం చేస్తున్న మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. డిజిటలైజేషన్ ఫలితంగా బీమా వ్యాపారంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. భారత్‌లో వాహన బీమా..డిజిటల్ ప్లాట్‌ఫాంలు, స్మార్ట్ సిస్టంల వైపు పయనిస్తోంది. బీమా సంస్థలు వేగవంతమైన సేవలు, మెరుగైన సమాచార మార్పిడిపై దృష్టి సారిస్తున్నాయి. నేడు బీమా సంస్థలకు అత్యంత విలువైన వాటిలో కీలకమైంది డేటా. ఇది మారుతున్న వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను, పాలసీలను రూపొందించడానికి బీమా సంస్థలకు వీలు కల్పిస్తుంది. AI వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా బీమా సంస్థలు వాహన డ్రైవర్ల వాస్తవ డ్రైవింగ్ సరళిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, బీమా సంస్థలు అనేక పద్ధతుల ద్వారా డేటాను సేకరించి ప్రమాదాలను మరింత కచ్చితంగా అంచనా వేయగలుగుతాయి. అదే సమయంలో, డ్రైవర్లు తమ సొంత డ్రైవింగ్ ప్రవర్తనలను ట్రాక్ చేయడం ద్వారా బీమా ప్రీమియంను ఆదా చేసుకోవచ్చు. బీమా సంస్థలు..ఓన్‌ డామేజ్‌ యాడ్‌-అన్‌లు, నేమ్డ్‌-డ్రైవర్‌ ప్లాన్లు, మైలేజీ ఆధారిత ప్రీమియంలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. డేటా ఆధారిత విధానం వల్ల, వాహన బీమా 'అందరికీ ఒకే విధానం' అనే పద్ధతి నుంచి క్రమంగా దూరమవుతూ, వాహనానికి, పాలసీదారుడికి ఉండే నిర్దిష్టమైన రిస్క్‌లకు అనుగుణంగా ప్రీమియంను సర్దుబాటు చేస్తుంది. ఓన్-డామేజ్ విభాగంలో ఈ మార్పు వినియోగదారులకు అందుబాటులో ఉన్న విస్తృత కవరేజీల శ్రేణిలో స్పష్టంగా కనిపిస్తోంది. వీటిలో రిటర్న్ టు ఇన్‌వాయిస్, నిల్ డిప్రిసియేషన్, కన్స్యూమబుల్స్ కవర్, ఇంజిన్ ప్రొటెక్టర్ వంటివి ఉన్నాయి. ఇవి పాలసీదారులు తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రక్షణ కల్పించుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. డేటా ఆధారిత విధానంతో వాహనానికి సంబంధించిన బీమా ప్రీమియం..వాహన వాస్తవ వినియోగం, డ్రైవింగ్ సరళిని బట్టి అమలవుతుంది. వినియోగ ఆధారిత వాహన బీమా..వినియోగదారులు ఒక సంవత్సరంలో తాము ఎంత దూరం ప్రయాణించాలని ఆశిస్తున్నారో ప్రకటించడానికి అనుమతిస్తుంది. బీమా ప్రీమియం ఆ వినియోగానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు సంవత్సరానికి 15,000 కిలోమీటర్ల వినియోగాన్ని ప్రకటిస్తే, వారు వాహన వినియోగ పరిధికి అనుగుణంగా బీమా కవరేజీని రూపొందించుకోవచ్చు. ఇందులో వాహనదారులు యాడ్‌-ఆన్‌ను ఎంపికజేసుకునే అవకాశముంటుంది. అంటే పాలసీ వ్యవధిలో వినియోగదారులు తమ ప్రయాణ దూరాలకు అదనపు కిలోమీటర్లను కూడా జోడించొచ్చు. దీనివల్ల వాహనానికి నష్టం జరిగిన సమయంలో పాలసీ పరిధిలో ఉన్న కిలోమీటర్ల(లేదా వినియోగదారునికి అందించిన అదనపు గ్రేస్ కిలోమీటర్ల)కు బీమా వర్తిస్తుంది. ‘నేమ్డ్ డ్రైవర్’ కవర్ విషయంలో వాహనాన్ని నడిపే లైసెన్స్ ఉన్న వ్యక్తులను బీమా చేయించుకున్నవారు ప్రకటిస్తారు. బీమా సంస్థలు బహుళ రక్షణలను ఒకే ప్యాకేజీగా కలిపి, బండిల్డ్ యాడ్-ఆన్‌లను కూడా అందిస్తున్నాయి. బీమా కవరేజ్‌ ఇప్పుడు వృత్తిపరమైన అవసరాలకు కూడా విస్తరిస్తోంది. బీమా సంస్థలు ఇప్పుడు రక్షణ సిబ్బందితో సహా నిర్దిష్ట ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా కవరేజీలను రూపొందిస్తున్నాయి. బీమా సేవలు అందించడంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వాహన బీమా భవిష్యత్తు..వేగవంతమైన పాలసీ కొనుగోలు, క్లెయిం నిర్వహణకు తోడ్పడే ఆన్‌లైన్ వ్యవస్థలతో ముడిపడి ఉంది. మాన్యువల్ పద్ధతులను తగ్గించడం ద్వారా, సాంకేతికతంగా క్లెయిం ప్రాసెసింగ్‌ వేగవంతం అవుతోంది. బీమా సంస్థలు పత్రాలను సమీక్షించడానికి, క్లెయింలను సమర్థవంతంగా అంచనా వేయడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తాయి. భవిష్యత్తు వాహన బీమాలో వేగంగా, కచ్చితత్వంతో దృష్టి సారించే క్రమబద్ధమైన క్లెయిం పద్ధతులు ఉంటాయి. దీనివల్ల పాలసీదారులకు క్లెయిం నిర్వహణ సులభంగా ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.