

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్వామివారికి వివిధ వాహన సేవలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ చేస్తోంది.
Also Read : AP Rains Alert : ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ జిల్లాల్లో నేడు కుండపోత వర్షాలు.. పిడుగులు, భీకరగాలులు.. హైఅలర్ట్..
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో భక్తులకు జారీచేసే స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను సోమవారం (సెప్టెంబర్ 14వ తేదీ) నుంచి 19వ తేదీ వరకు.. అంటే ఆరు రోజులపాటు నిలిపివేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీని నియంత్రించేందుకు ఈ ఆరు రోజులు టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఎస్ఎస్డీ టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనున్నారు. 21వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 20వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయకపోయినా భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. టోకెన్ లేకుండానే నేరుగా తిరుమలలోని క్యూలైన్లలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. అయితే, బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే.. సోమవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు తీసుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే పలువురు భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. అయితే, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టోకెన్ల జారీ ఉండదని అధికారులు వెల్లడించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. దీంతో పలువురు నేరుగా తిరుమలకు బయలుదేరారు.
బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన ధ్వజారోహణానికి అవసరమైన దర్భ చాప, దర్భ తాడును టీటీడీ అటవీ విభాగం సిద్ధం చేసింది. అటవీ విభాగం కార్యాలయం నుంచి వీటిని టీటీడీ జేఈవో డాక్టర్ శరత్, డీఎఫ్వో ఫణికుమార్ నాయుడు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు.
15వ తేదీన సాయంత్రం 6.21 గంటల నుంచి 6.35 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం. రుత్వికులు వేద మంత్రాలను పఠిస్తూ దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు.
శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మాడవీధుల్లో పెద్దశేషవాహనంలో ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. మంత్రి లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులూ హాజరుకానున్నారు. అదేవిధంగా బుధవారం తిరుమలలో సుమారు రూ.300 కోట్ల విలువైన పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.




