
ఇంటర్నెట్‌ డెస్క్: ఆసియాలో అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (TikTok founder Zhang Yiming) నిలిచారు. భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆయన ఈ స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఆసియా టాప్‌-5 సంపన్నుల జాబితాను వెల్లడించింది. 43 ఏళ్ల వయసున్న జాంగ్‌ యిమింగ్‌ సంపద విలువ 105 బిలియన్‌ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.10.02 లక్షల కోట్లు) పైనే ఉంది. మార్చి 2019లో నమోదైన 13 బిలియన్ డాలర్లతో (రూ.1.24 లక్షల కోట్లు) పోలిస్తే.. ఆయన సంపద విలువ 8 రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. ఆసియాలో అత్యంత సంపన్నుల్లో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ, ముకేశ్ అంబానీ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో జపాన్‌కు చెందిన యునిక్లో ఫౌండర్‌ తడషి యానై నిలవగా, సాఫ్ట్‌ బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ ఐదో స్థానంలో ఉన్నారు. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌ ఏఐ రంగంలో వేగంగా విస్తరించడమే ఇందుకు కారణంగా నివేదిక పేర్కొంది. డౌబావో ఏఐ చాట్‌బాట్‌, సీడాన్స్ వీడియో జనరేషన్‌ మోడళ్లు అధిక వృద్ధి నమోదు చేయడంతో ఆయన సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ నెలలోనే 12 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద పెరగడం గమనార్హం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.