
ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు కోసం అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మియామిలో జరగనున్న జీ20 సదస్సు (G20)లో జెలెన్‌స్కీ-పుతిన్‌ నేరుగా చర్చ (Putin Zelenskyy Meeting)ల్లో పాల్గొననున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపడేశారు. ఇరువురి మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం అసాధ్యమని పేర్కొన్నారు. ఒకవేళ జెలెన్‌స్కీ.. పుతిన్‌ను నేరుగా కలవాలంటే మాస్కోకు రావాలని పునరుద్ఘాటించారు. తమ దేశంలో కాకుండా మరే ప్రదేశంలోనూ చర్చలు నిర్వహించడానికి తాము అంగీకరించబోమన్నారు.
అమెరికా వేదికగా డిసెంబర్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ (Putin) హాజరవుతారా లేదా అనే విషయంపైనా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయంపై శనివారం జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. జీ20 సమయంలో అమెరికా తనను, పుతిన్‌ను ఆహ్వానిస్తే రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యుద్ధం విషయంలో మాస్కో ఏమనుకుంటుందన్నదే ముఖ్యమన్నారు. అదే సమయంలో గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం తాము మరింత బలంగా రష్యా సేనలను ఎదుర్కొంటున్నామన్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు ఐరోపా సేనలు వస్తే.. మాతో యుద్ధాన్ని కోరుకున్నట్లే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






