
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేయడం శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ముగింపు ఉండదని, కేవలం విరామాలు మాత్రమే ఉంటాయని వ్యాఖ్యానించిన ఆయన, జిల్లా పార్టీ అధ్యక్షుడి పనితీరుపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఖండించకపోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన వర్గం నుంచి కిరణ్‌ను కాపాడింది తమ్మినేని సీతారాం కాదా అని ప్రశ్నించారు. తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు మధ్య రహస్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు వంటి ముఖ్య నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏనాడూ వివక్ష చూపలేదని, కానీ ఇప్పుడు జిల్లాలో ఒకే కులం ప్రాబల్యాన్ని పెంచేలా పార్టీ సాగుతోందనే చర్చ జరుగుతోందన్నారు. ఆమదాలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవి అభ్యర్థిత్వంపై నాయకుల్లో అభద్రత ఉందని పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదని హెచ్చరించిన నాగ్... తక్షణమే ఐప్యాక్ లేదా సొంత సర్వే ద్వారా శ్రీకాకుళం వైసీపీ స్థితిగతులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.





