SSY Calculator: ఆడ పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యతం ప్రజాదరణ పొందిన పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే ఇందులో ప్రభుత్వం అత్యధికంగా 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇందులో నెలకు రూ.500, రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే ఎంతొస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల పాటు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అది నెల నెలా, ఆరు నెలలు, ఏడాది చొప్పున మనకు నచ్చినట్లుగా జమ చేయవచ్చు. కనీసం ఏడాదికి ఒకసారి రూ.250 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తర్వాత మొత్తం నిధి మెచ్యూరిటీకి వస్తుంది. 10 సంవత్సరాల లోపు ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతా తెరవవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో అకౌంట్ తీసుకోవచ్చు.నెలకు రూ.500 జమ చేస్తే ఎంతొస్తుంది?5 ఏళ్ల వయసు ఉన్న మీ పాప పేరుపై మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచారు అనుకుందాం. అంటే ఆమెకు 26 ఏళ్ల వయసు వచ్చాక అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అయితే, 18 ఏళ్ల తర్వాత ఉన్నత చదువులకు, 21 ఏళ్ల తర్వాత పెళ్లి కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేశారు అనుకుందాం. వార్షిక పెట్టుబడి రూ.6000 అవుతుంది. 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.90 వేలు పెట్టుబడి పెడతారు. దీనిపై ప్రస్తుతం ఇస్తోన్న 8.20 శాతం వడ్డీ ప్రకారం రూ.1,87,103 వరకు వడ్డీ వస్తుంది. అంటే 21 ఏళ్ల తర్వాత చేతికి రూ.2,77,103 వరకు వస్తాయి.నెలకు రూ.1000 జమ చేస్తే ఎంతొస్తుంది?సుకన్య సమృద్ధిలో మీరు నెలకు రూ.1000 చొప్పున డిపాజిట్ చేస్తే మీ వార్షిక పెట్టుబడి రూ.12000 అవుతుంది. అంటే 15 సంవత్సరాల పాటు మీరు రూ.1,80,000 పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం లెక్కిస్తే మీకు రూ.3.74,206 వడ్డీ లభిస్తుంది. 21 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ.5,54,206 వస్తాయి.ఇలా రూ.72 లక్షలొస్తాయ్..అయితే, సుకన్య సమృద్ధి పథకంలో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా కాంపౌండింగ్ మ్యాజిక్ కనిపిస్తుంది. అలాగే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు గరిష్ఠ పరిమితి రూ.1.50 లక్షల చొప్పున 15 ఏళ్లు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీకు 21 ఏళ్ల తర్వాత చేతికి రూ. 72 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.22.50 లక్షలు మాత్రమే. రూ.50 లక్షల వరకు మీకు వడ్డీ రూపంలోనే వస్తుంది.





