
Srinivas Goud | దేశవ్యాప్తంగా బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి, ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించిన తర్వాతే జనగణన చేపట్టాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన చేస్తామని గతంలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఆరోపించారు. బీసీ కులగణన అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. న్యూఢిల్లీలోని జవహర్ భవన్లో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించాలంటే ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలంటే కులగణన కీలకమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ కులాలకు కూడా ప్రత్యేక కోడ్లు కేటాయించాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకే కులాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సమగ్ర జాబితా రూపొందించాలన్నారు. ధోబి–రజక, నాయీ బ్రాహ్మణ–మంగలి, గౌడ్–ఈడిగ, శ్రీశైన–నాడార్, ముదిరాజ్, ఫిషర్మెన్ తదితర కులాలకు రాష్ట్రాల వారీగా వేర్వేరు పేర్లు ఉన్నాయని తెలిపారు. కేవలం కులం పేరును అడిగి నమోదు చేస్తే స్పెల్లింగ్, ఉచ్చారణలోని చిన్నపాటి తేడాల కారణంగా ఒకే కులానికి చెందినవారు వేర్వేరు కులాలుగా నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. 2011లో కులగణన నిర్వహించిన సమయంలో కులాల పేర్లను శాస్త్రీయంగా వర్గీకరించకపోవడంతో లక్షలాది కులాలు ఉన్నట్లు నమోదు చేసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనలో 1931లో కులగణన నిర్వహించినప్పుడు సుమారు 4,300 కులాలు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. సరైన కుల జాబితా, కోడ్ వ్యవస్థ లేకుండా కులగణన నిర్వహిస్తే మళ్లీ అనేక రకాల పేర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల జాబితాలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఓబీసీ కులాల సమగ్ర జాబితాను రూపొందించాలని కోరారు. ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ ఇవ్వాలని, అప్పుడే వృత్తి ఆధారిత కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. లేకపోతే బీసీ కులగణన పేరుతో మోసం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన “జిత్నీ ఆబాదీ ఉత్నా హిస్సా” నినాదం అమలు కావాలంటే ముందుగా దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా ప్రశ్నించాలని, జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనలకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు కూడా బీసీ కులగణన విషయంలో బాధ్యత ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు న్యాయం జరగాలన్నా బీసీ జనాభా, వారి ప్రాతినిధ్యం స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీసీ నాయకులు, మేధావులు, సామాజిక సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు కాస్ట్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. లక్షలాది మందితో ఆందోళనలు నిర్వహించి, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి బీసీ కులగణనలో శాస్త్రీయ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఒకే కులం ఒక రాష్ట్రంలో ఓసీగా, మరో రాష్ట్రంలో బీసీగా, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీగా ఉండే పరిస్థితులు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా ఉన్న వర్గీకరణను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా కులాల సమగ్ర జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. జనగణనలో ప్రత్యేకంగా బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, శాస్త్రీయమైన కోడ్ వ్యవస్థను అమలు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. దేశవ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసి కార్యాచరణ చేపట్టి, బీసీ కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
