
Home » Sports » Smriti Mandhana emotional podcast interview world cup hardest night srav
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. వ్యాఖ్యాత రాజ్ షమాని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె కాస్త భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. మైదానంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ క్రికెటర్.. ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మృతి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. వ్యాఖ్యాత రాజ్ షమాని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె కాస్త భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ షమాని.. ‘మీ జీవితంలో అత్యంత కఠినమైన రాత్రి ఏది?’ అని స్మృతి మంధానను ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న వెంటనే స్మృతి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించిన ఆమె.. సమాధానం చెప్పేందుకు కొన్ని సెకన్లు తీసుకుంది. ఆ తర్వాత ‘బహుశా ఏదైనా ప్రపంచకప్ కావచ్చు’ అంటూ స్మృతి క్లుప్తంగా సమాధానమిచ్చింది. అయితే ఏ ప్రపంచకప్ లేదా ఏ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నదో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. ‘నేను క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడతాను’ అని స్పష్టం చేసింది. గతంతో సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో అర్ధంతరంగా పెళ్లి రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం స్మృతి మానసికంగానూ ఇబ్బంది పడింది.
ఈ క్రమంలో తన కోపం గురించి కూడా స్మృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా చూస్తే తనకు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తిలా కనిపించనని చెప్పిన ఆమె.. తనలో మాత్రం చాలా కోపం ఉంటుందని వెల్లడించింది. ‘నేను ఎవరి దారిలోకి వెళ్లను. అలాగే నా దారిలోకి కూడా ఎవరూ రావద్దు. నాతో పెట్టుకోవద్దు. నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని కాదు. కానీ జరిగిన విషయాన్ని మాత్రం మర్చిపోను. ఎవరికీ చెడు చేయాలని అనుకోను’ అని స్మృతి చెప్పింది. ఇక ఎవరైనా తనను బాధపెడితే వారిని సులభంగా క్షమిస్తారా? అన్న ప్రశ్నకు కూడా ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చింది ‘క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను మర్చిపోను’ అని స్మృతి మంధాన వెల్లడించింది.
ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!
భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం





