
SIR | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో ఓటర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. జాబితాలోని అక్షర తప్పిదాలు, వయసు, ఇంటి పేరు, తండ్రి పేరు వంటి వివరాల్లో స్వల్ప వ్యత్యాసాలకూ ‘అనామలీ’గా గుర్తింపు.. మ్యాపింగ్ కాని ఓటర్ల నుంచి నిర్దేశిత ధ్రువపత్రాల సమర్పణకు నోటీసులు జారీ చేశారు. దీంతో సామాన్య ఓటర్లు అవస్థలు పడుతున్నారు. తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఆధారాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,70,194 మందికి నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించగా, ఇప్పటివరకు 2,24,263 మందికే నోటీసులు అందాయి. వీరిలో దాదాపు లక్ష మంది మాత్రమే విచారణకు హాజరై అధికారులు కోరిన ధ్రువపత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. మరో 1.24 లక్షల మంది ఇప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో వారి హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓటు హక్కుకు సంబంధించిన ఇంత కీలకమైన ప్రక్రియలో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు విచారణకు దూరంగా ఉండటం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నోటీసుల పరిష్కార ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తి చేయాల్సి ఉండగా, నోటీసుల పంపిణీ కూడా పూర్తికాకపోవడంతో గడువును అక్టోబరు 7 వరకు పొడిగించారు. తుది ఓటర్ల జాబితా సైతం అక్టోబరు 19కు బదులు నవంబరు 9న వెలువడనుంది. అంటే గడువు పెంచినా క్షేత్రస్థాయిలో ప్రక్రియ మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరయ్యే ఓటర్లు తమ కేసుకు అనుగుణంగా 11 రకాల ధ్రువపత్రాల్లో అధికారులు కోరిన వాటిని సమర్పించాల్సి ఉంది. అయితే వృద్ధులు, నిరక్షరాస్యులు, దూర ప్రాంతాల్లో నివసించే వారు, తల్లిదండ్రుల ఆధారాలు అందుబాటులో లేని వారు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు ఓటర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కుల ధ్రువీకరణ పత్రాల జారీ కూడా సకాలంలో జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ వేగవంతం చేసేందుకు కలెక్టర్ అదనపు ఏఈఆర్ఓలను నియమించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రెవెన్యూ యంత్రాంగం 22ఏ భూముల జాబితా సవరణ పనుల్లో నిమగ్నం కావడంతో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రభావం పడుతున్నట్లు అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో నోటీసుల పంపిణీ కూడా ఆశించిన స్థాయిలో సాగడం లేదని తెలుస్తోంది. విచారణకు హాజరు కాకపోయినా ఓటు తొలగించరనే భావనతో కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్న అంశంపై సమగ్ర అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఓటరూ తమ పేరు, వివరాలను ‘సీఈఓ తెలంగాణ’ పోర్టల్లో పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నా.. మారుమూల ప్రాంతాలు, నిరక్షరాస్యులు, ధ్రువపత్రాలు లేని వారికి ఈ ప్రక్రియను సులభతరం చేసే చర్యలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. దాన్ని నిర్ధారించుకునేందుకు సామాన్యుడు ఆధారాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావడం ఎస్ఐఆర్ అమలులో లోపాలను ఎత్తిచూపుతోంది. అర్హుడి ఓటు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.