
Updated on: Sep 13, 2026 | 1:19 PM
సముద్రం అనగానే నిరంతరం హోరెత్తించే అలలు, తీరాన్ని తాకే ఉవ్వెత్తు కెరటాలు గుర్తొస్తాయి. కానీ కళ్ల ముందే సముద్రం కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయి. తిరిగి యథావిధిగా ముందుకు వచ్చే వింత ఎప్పుడైనా చూశారా? ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ సందర్శించాల్సిందే. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ తీరం గురించి చాలా మందికి తెలియవు. చాందీపూర్ బీచ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రధాన అంశం ఇక్కడి ఆటుపోట్లు . రోజుకు రెండుసార్లు ఇక్కడ సముద్రపు నీరు ప్రధాన తీరం నుంచి ఏకంగా 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది.
నీరు వెనక్కి తగ్గిన సమయంలో సముద్రపు అడుగుభాగం పూర్తిగా బయటపడుతుంది. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ ఇసుక నేలపై కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లవచ్చు, లేదా వాహనాల్లోనూ ప్రయాణించవచ్చు. నిర్ణీత సమయానికి హై టైడ్ మొదలవగానే సముద్రపు నీరు మళ్లీ తీరం వైపు వేగంగా పరుగులు తీస్తుంది. ఈ సహజ అద్భుతం భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తుల వల్ల ఇక్కడ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.
సముద్రపు నీరు తగ్గినప్పుడు కనిపించే తడి ఇసుక తిన్నెలపై జీవవైవిధ్యం అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది.
రెడ్ ఘోస్ట్ క్రాబ్స్: వేల సంఖ్యలో ఎరుపు రంగు పీతలు బయటకు వచ్చి ఇసుకలో పరుగులు తీస్తుంటాయి. దూరం నుంచి చూస్తే తీరమంతా ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపిస్తుంది.
గుర్రపుడెక్క పీతలు : డైనోసార్ల కాలం నాటి సజీవ శిలాజాలుగా పిలిచే హార్స్‌షూ క్రాబ్స్ కూడా ఈ తీరంలో దర్శనమిస్తాయి. వీటి నీలి రంగు రక్తం వైద్య రంగంలో ఎంతో విలువైనది. రకరకాల సముద్రపు గవ్వలు, శంఖాలు, నత్తగుల్లలు తీరమంతా విస్తరించి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.
చాందీపూర్ కేవలం పర్యాటక ప్రాంతమే కాదు. భారత దేశ భద్రతలో అత్యంత కీలకమైన ప్రాంతం. చాందీపూర్ తీరానికి సమీపంలోనే ఐటీఆర్ అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఉన్నాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన అగ్ని, పృథ్వి, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణుల ప్రయోగాలు ఇక్కడి నుంచే విజయవంతంగా నిర్వహిస్తారు. అందుకే దీనిని భారత క్షిపణి ప్రయోగాల రాజధానిగా కూడా పిలుస్తారు.
తీరం వెంబడి దట్టంగా పెరిగిన కాజురినా (సర్వి) వృక్షాలు, తాటి తోటలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి ఇది సరైన గమ్యస్థానం. అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి చాందీపూర్ సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్ (200 కి.మీ) లేదా కోల్‌కతా (250 కి.మీ) విమానాశ్రయాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ప్రకృతి వింతలను, పచ్చని ప్రకృతి అందాలను, దేశ రక్షణ చరిత్రను ఒకే చోట అనుభవించాలనుకునే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అద్భుత తీరం చాందీపూర్.






