
ఉప్పల్, సెప్టెంబర్ 13: ఆర్యవైశ్యులు సౌమ్యులని, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవాళ్లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సషభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులని, ఒకటి వ్యవసాయం, మరొకటి వ్యాపారమని తెలిపారు. దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలిస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. పేదలైన ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీ ఎంపీ మధుయాషీ తదితరులు పాల్గొన్నారు.