
Ramchander Rao Arrest Proof Of Congress Anarchy Says Nitin Nabin
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఈ అణచివేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి, నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని నితిన్ నబీన్ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసు యంత్రాంగం... బాధితులకు అండగా నిలిచేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ కేవలం ప్రజలను మభ్యపెట్టే నాటకాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలు, ప్రతిపక్షాలపై దాడులకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు. రాంచందర్ రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.





