
డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన మైనర్ల వివరాలు పోర్టల్‌లో నమోదు 25 ఏళ్లు నిండే వరకు డీఎల్‌ రాకుండా బ్లాక్‌ పెరుగుతున్న మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు ఈనాడు, హైదరాబాద్‌: కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు బైక్‌ ఇచ్చి కిరాణా దుకాణంలో పాలో, పప్పో తీసుకురా అని పంపుతుంటారు. ఇంటి దగ్గరే కదా పిల్లాడికి బండి అలవాటైనట్లుంటుందని కొందరనుకుంటే.. మరికొందరు అప్పుడే మా వాడు బైక్‌ నడిపేస్తున్నాడని ముచ్చట పడుతుంటారు. ఇలానే ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడితో ఓఆర్‌ఆర్‌పై ఖరీదైన కారు స్టీరింగ్‌ చేతికివ్వగా కేసు నమోదైంది. కారు ఆర్సీ ఏడాదిపాటు రద్దయింది. పైగా ఆ బాలుడు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అవకాశాన్నీ కోల్పోయాడు. ఇటీవల ఈ తరహా కేసులు నమోదవుతుండటంతో రవాణాశాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. 2024-25లో రాష్ట్రంలో 1,760 ఆర్సీలు రద్దయితే అందులో 80% గ్రేటర్‌లోనివే ఉన్నాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 1,455 ఆర్సీలు రద్దయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా మైనర్లు నడిపిన 4,070 వాహనాల ఆర్సీలు ఏడాదిపాటు రద్దు చేశారు. ఈ వారంలో ప్రక్రియ పూర్తి చేస్తాం - వెంకటరమణ, జేటీసీ, హైదరాబాద్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డ మైనర్ల ఆధార్, ఇతర పూర్తి వివరాలు ‘సారథి’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నాం. వారికి 25 ఏళ్లు నిండే వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రాకుండా బ్లాక్‌ చేస్తున్నాం. కొత్త డీఎల్‌ ఎలాగూ సారథి నుంచే జారీ చేస్తుండటంతో ఆధార్‌ నంబరు నమోదు చేయగానే సంబంధిత వ్యక్తికి లైసెన్స్‌ ఇవ్వొచ్చా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ వారంలో ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. పాత కేసుల డేటా కూడా నమోదు చేస్తున్నాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.