
ఇంట్లో పని కావాలని అడిగి, నాలుగు రోజులు చేశాక చెప్పా పెట్టకుండా మానేసే పనిమనుషుల్ని చాలామందినే చూసుంటాం. అలాగని అప్పటికప్పుడు మరో పనిమనిషి కోసం వెతకడమంటే పెద్ద సవాలనే చెప్పాలి. స్వీయానుభవంతో ఈ సమస్యను ఎదుర్కొంది ప్రియాంక రస్తోగీ. ఇంట్లో పని కావాలని అడిగి, నాలుగు రోజులు చేశాక చెప్పా పెట్టకుండా మానేసే పనిమనుషుల్ని చాలామందినే చూసుంటాం. అలాగని అప్పటికప్పుడు మరో పనిమనిషి కోసం వెతకడమంటే పెద్ద సవాలనే చెప్పాలి. స్వీయానుభవంతో ఈ సమస్యను ఎదుర్కొంది ప్రియాంక రస్తోగీ. తనలాగే చాలామందికి పనిమనుషుల అవసరం ఉందని గుర్తించిన ఆమె.. తనే స్వయంగా ఓ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ వేదికగా పనిమనుషులు, వంట వారు, హెల్పర్స్‌, కేర్‌ టేకర్స్కి శిక్షణనిస్తూ వాళ్ల సేవల్ని అవసరం ఉన్న వారికి చేరువ చేస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో సేవలందిస్తోన్న తన సంస్థ గురించి ప్రియాంక ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పుట్టి పెరిగింది ప్రియాంక. చిన్న వయసు నుంచే పైలట్‌ కావాలని కలలు కంది. దీనికి సంబంధించిన ఎంపిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఆ సమయంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ఆమె శరీరంపై దాదాపు 250 దాకా కుట్లు పడ్డాయి. కుడి కాలికి రాడ్‌ కూడా అమర్చారు. దాంతో ఆమె కల కలగానే మిగిలిపోయింది. అయినా అధైర్యపడకుండా చదువు కొనసాగించిన ఆమె.. బీఎస్సీ పూర్తిచేశాక.. ‘టూరిజం-ట్రావెల్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌’లో పీజీ డిప్లొమా కోర్సు చేసింది. ఆపై వివిధ సంస్థల్లో పనిచేసింది. అయితే కొన్నేళ్లు గడిచాక ప్రియాంక అత్తగారు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడి పక్షవాతానికి గురయ్యారు. దీంతో ఆమెను చూసుకోవడానికి ఉద్యోగం వదిలి.. భర్తతో కలిసి గురుగ్రామ్‌ నుంచి బెంగళూరు వచ్చేసింది. ‘నేను మా అత్తగారి బాగోగులు చూసుకున్నప్పటికీ.. ఇంటి పనులు చేయడానికి పని మనిషి కోసం వెతికాం. కొందరు ఏజెంట్స్‌నీ సంప్రదించాం. అయితే ఎవరొచ్చినా ఆసక్తిగా రెండుమూడు రోజులు పనిచేయడం, నాలుగో రోజు చెప్పా పెట్టకుండా మానేయడం.. ఇలా కొన్నిసార్లు జరిగింది. దీంతో పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేక ఇబ్బంది పడ్డా. దీనికి పరిష్కారం వెతుకుతున్నప్పుడే.. హోమ్‌ హెల్పర్స్‌గా శిక్షణ పొందేందుకు వీలు కల్పించే ఒక ప్రభుత్వ ధృవీకరణ పత్రం గురించి తెలుసుకున్నా. ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వడానికే ‘జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ)’లో ప్రత్యేక శిక్షణ పొంది మాస్టర్‌ ట్రైనర్‌గా సర్టిఫికేషన్‌ సంపాదించా.. ఈ క్రమంలోనే ఇలాంటి హోమ్‌ హెల్పర్స్‌ని తయారుచేసి.. అవసరార్థులకు వీళ్ల సేవలందిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇదే ‘ఈజీ హెల్పర్స్‌’ అనే సంస్థను ప్రారంభించేందుకు కారణమైంది..’ అంటోన్న ప్రియాంక.. 2020లో తన ఫ్రెండ్‌తో కలిసి దీన్ని ప్రారంభించింది. మొదట్లో ఇంటి పనులు, ఇంట్లో ఉన్న వారి బాగోగులు చూసుకునేలా ఆయా వ్యక్తులకు శిక్షణ ఇస్తూ పని కల్పించిన ప్రియాంక.. ఆపై తన సేవల్ని క్రమంగా విస్తరించింది. ‘మా వద్ద శిక్షణ పొందిన సహాయకులు తమకు అప్పగించిన పనులు పూర్తిచేయడానికి రోజూ ఆయా ఇళ్లకు వెళ్లి వచ్చే వారు. కరోనా సమయంలో శాశ్వత సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. వినియోగదారుల అవసరాల్ని బట్టి మా సంస్థ సేవల్ని క్రమంగా విస్తరిస్తున్నాం. ఇంటి పనులు, వంట పని, ఇంట్లోని వృద్ధులు-పిల్లల్ని చూసుకునే కేర్‌ టేకర్స్‌, పేషెంట్‌ కేర్‌ టేకర్స్‌, ప్రత్యేక అవసరాలున్న వారి బాగోగులు చూసుకునే వారు, డ్రైవర్లు, నర్సింగ్‌ కేర్‌.. ఇలా విభిన్న అంశాల్లో శిక్షణనిస్తూ అవసరం ఉన్న వారికి వాళ్ల సేవల్ని చేరువ చేస్తున్నాం. ఫుల్‌-టైమ్‌, పార్ట్‌-టైమ్‌, ఆన్‌-డిమాండ్‌.. పద్ధతుల్లో చాలామంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. తద్వారా పని చేసుకునే వారికి స్థిరమైన ఉపాధి కూడా కల్పించగలుగుతున్నాం..’ అంటోన్న ప్రియాంక.. ప్రస్తుతం తన సేవల్ని బెంగళూరుతో పాటు హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, నోయిడా, నాగ్‌పూర్‌.. తదితర నగరాలకూ విస్తరించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా తన సంస్థ సేవల్ని వినియోగదారులకు చేరువ చేస్తోందామె. ముక్కూ మొహం తెలియని వారిని ఇంట్లో పనిలో పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించరు. వాళ్లు ఎలాంటి వారో అన్న భయం మరికొంతమందిలో ఉంటుంది. కానీ తమ వద్ద శిక్షణ పొందిన హెల్పర్లతో ఆ భయం ఉండదంటోంది ప్రియాంక. ‘కస్టమర్ల భద్రత, నమ్మకానికే మేం పెద్దపీట వేస్తున్నాం. పనిలో చేరే ముందే హెల్పర్‌ ఆధార్‌ వెరిఫికేషన్‌, ఈ-కేవైసీ, పోలీస్‌ వెరిఫికేషన్‌, వాళ్ల ఇళ్లకు వెళ్లి చుట్టుపక్కల వారిని అడిగి వారి గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం.. వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగని హెల్పర్స్‌ని నిర్లక్ష్యం చేయట్లేదు. వాళ్లకు ఉచిత శిక్షణ ఇస్తూనే పని కల్పిస్తున్నాం. అంతేకాదు.. వాళ్ల పనికి తగిన జీతం నెల తిరిగే సరికి కచ్చితంగా వాళ్ల బ్యాంకు ఖాతాలో పడేలా చొరవ చూపుతున్నాం. అదనపు పని వేళలకు అదనంగా డబ్బు చెల్లిస్తున్నాం. ఇలా స్థిరమైన ఉపాధి దొరకడంతో చాలామంది మా సంస్థలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే వలస వచ్చే మహిళా కార్మికుల కోసం ప్రత్యేక హాస్టల్‌ వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం..’ అంటోన్న ప్రియాంక ఈ ఆరేళ్లలో కొన్ని వేల మందికి ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించింది. తన సంస్థలో 90 శాతం మంది మహిళల్నే చేర్చుకుంటూ మహిళా సాధికారతకూ కృషి చేస్తోంది. త్వరలోనే యాప్‌ని విడుదల చేసి.. దీని ద్వారా తమ సంస్థ సేవల్ని మరింతమంది వినియోగదారులకు చేరువ చేయనున్నట్లు చెబుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings