
హైదరాబాద్‌: బొల్లారంలోని ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు (Army weapons theft case)లో ప్రధాన నిందితుడు, మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను పోలీసులు నేడు కస్టడీకి తీసుకోనున్నారు. 7 రోజుల కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న మల్లేశ్‌ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఆయుధాల చోరీ వెనుక అసలు కారణాలపై లోతుగా ప్రశ్నించనున్నారు. ఏకే-47లు, పిస్తోళ్లు, మందుగుండు సామగ్రి చోరీపై ఆరా తీయనున్నారు. మల్లేశ్‌ ఫోన్‌లో డిలీట్‌ చేసిన డేటాను దర్యాప్తు బృందాలు రికవరీ చేస్తున్నాయి. జింఖానా మైదానంలో అతడిని కలిసిన వ్యక్తిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో పనిచేసిన ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని వ్యక్తులతో లింకులపై వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి మరో ఆర్మీ ఉద్యోగి సహకరించాడా? ఆయుధాలను ఎవరికైనా విక్రయించేందుకు లేదా అప్పగించేందుకు చూశాడా? దీని వెనుక ఏదైనా నెట్‌వర్క్‌ ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలకు దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు అందించే అవకాశముంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.