
బాధితుల మాటలకు అక్షర రూపం ఏఐ పరిజ్ఞానంతో స్పందిస్తున్న ‘డయల్‌ 112’ టీజీఐసీసీసీలో ఆపద్బాంధవుడికి ఆధునిక హంగులు ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎవరైనా అత్యవసర సాయం కోసం ఫోన్‌ చేస్తే కాల్‌సెంటర్‌కు కాల్‌ వెళ్తుంది. ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌(ఐవీఆర్‌ఎస్‌) బటన్లను నొక్కిన అనంతరం అక్కడి కాల్‌టేకర్‌ స్పందిస్తారు.. బాధితులు చెప్పే వివరాల్ని నమోదు చేసుకుని ఘటన జరిగిన ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిస్తారు. ఆ ఠాణాలోని బ్లూకోల్ట్స్‌ సిబ్బంది బాధితుడి నంబరుకు కాల్‌ చేసి ఘటనాస్థలికి చేరుకుంటారు..’ ఇదీ గతంలో ‘డయల్‌ 100’ కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్‌కు ప్రతిస్పందన ‘ఆపద వేళ సాయం కోసం ఫోన్‌ చేసినప్పుడు ఓవైపు ఐవీఆర్‌ఎస్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే ఒకవేళ కాలర్‌ వైపు నుంచి అరుపులు, గొడవలు వినిపిస్తే అర క్షణంలో స్పందిస్తుంది.. బాధితులు ఐవీఆర్‌ఎస్‌ బటన్లు నొక్కకపోయినా ఆ ప్రక్రియను దాటుకొని కాల్‌టేకర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఘటనాస్థలి ఎక్కడుందో విశ్లేషించి వెంటనే అక్కడి బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది..’ ఇదీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న ‘డయల్‌ 112’ కాల్‌సెంటర్‌ వ్యవస్థ ప్రతిస్పందన ప్ర జల ఆపద్బాంధవుడిగా ‘డయల్‌ 112’ సమర్థ పాత్ర పోషిస్తోంది. గతంలో ఈ పాత్ర ‘డయల్‌ 100’ వ్యవస్థ పోషించేది. దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ అవసరమంటూ కేంద్రం డయల్‌ 112ను తీసుకొచ్చింది. దేశంలో ఏ మూల నుంచైనా ఈ నంబరుకు కాల్‌ చేస్తే చాలు బాధితుడి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా సంబంధిత రాష్ట్రంలోని కాల్‌సెంటర్‌కు కాల్‌ చేరిపోతుంది. కాల్‌సెంటర్‌ సిబ్బంది వివరాలు తెలుసుకొని ఘటనాస్థలికి సమీపంలోని బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగేదే అయినా.. తెలంగాణ పోలీసులు మరింత ముందడుగు వేసి ఇప్పుడు ఆధునిక హంగుల్ని జోడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కొంపల్లిలో ఏర్పాటు చేసిన డయల్‌ 100 వ్యవస్థను కొంతకాలం క్రితం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీజీఐసీసీసీ)’కి మార్చారు. ఇక్కడ రెండు అంతస్తుల్లో ‘తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌(టీజీఈఆర్‌ఎస్‌ఎస్‌)’ కాల్‌సెంటర్‌ను అధునాతనంగా తీర్చిదిద్దారు. కొంపల్లిలో 18 డెస్క్‌లు ఉండగా టీజీఐసీసీసీలోకి మార్చాక 50కిపైగా ఏర్పాటు చేశారు. పోలీస్‌.. ఫైర్‌.. మెడికల్‌.. చైల్డ్‌ సర్వీస్‌.. మహిళాభద్రత.. రోడ్డుప్రమాద క్షతగాత్రులకు సహాయం.. ఇలా అన్నింటికీ ఒకటే అత్యవసర నంబరును అందుబాటులోకి తెచ్చారు. దీనికితోడు ఈ వ్యవస్థకు కృత్రిమమేధ(ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో దేశంలోనే అత్యుత్తమ కాల్‌సెంటర్లలో ఒకటిగా ఉండేలా తీర్చిదిద్దారు. అధునాతన డ్యాష్‌బోర్డులు, డేటా ఎనలిటిక్స్‌తో కూడిన పరిజ్ఞానం మేళవించి ఉండటంతో ఒకేసారి 900లకుపైగా కాల్స్‌ను నిర్వహించగల సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతం. ఏఐ ఆధారిత టీజీఈఆర్‌ఎస్‌ఎస్‌ సేవలు ఇలా.. ఫోన్‌కాల్‌ సంభాషణలో ఓవైపు ఐవీఆర్‌ఎస్‌ నడుస్తున్న సమయంలోనే.. కాలర్‌ స్వరంలో భయం, అరుపులు, ఏడుపులు లేదా వెనక వస్తున్న అల్లర్లు, గొడవల శబ్దాలను ఆటోమేటిగ్గా విశ్లేషిస్తుంది. ఒకవేళ ప్రమాదకర స్థితిలో ఉన్నవారు ఐవీఆర్‌ బటన్లు నొక్కకపోయినా, నేరుగా మాట్లాడటం ఆరంభించినా ఈ అధునాతన వ్యవస్థ ఐవీఆర్‌ను దాటుకొని(బైపాస్‌ చేసి) నేరుగా కాల్‌టేకర్‌కు కనెక్ట్‌ చేస్తుంది. ఒకే నంబరు నుంచి వరుసగా అత్యవసర కాల్స్‌ వస్తుంటే ఆలస్యం చేయకుండా నేరుగా సిబ్బందికి అనుసంధానం చేస్తుంది. కాలర్‌ మాట్లాడే ప్రతి మాటను సిస్టమ్‌ రియల్‌టైంలోనే అక్షర రూపంలోకి మారుస్తుంది. కాల్‌టేకర్‌తో బాధితుడు జరిపిన సంభాషణ ఆధారంగా అసలేం జరిగిందో సిస్టమ్‌ అర్థం చేసుకుంటుంది. ఘటనకు సంబంధించిన సంక్షిప్త సారాంశాన్ని రూపొందిస్తుంది. కాలర్‌ చెప్పే విషయాల ఆధారంగా సంఘటన ఏ రకానికి చెందినదో(ఉదాహరణకు రోడ్డుప్రమాదం/ఘర్షణ/దొంగతనం..) యాంత్రికంగానే వర్గీకరిస్తుంది. సంఘటన స్వభావాన్ని బట్టి ఏరకమైన సేవలు(పోలీస్‌/ఫైర్‌/అంబులెన్స్‌) అందించాలో సూచిస్తుంది. బాధితులు లేదా కాలర్లు తమ లొకేషన్‌ను సరిగ్గా చెప్పలేని క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఘటనాస్థలిని కచ్చితంగా గుర్తిస్తుంది. ఘటన జరిగిన ప్రదేశం, స్వభావం, అందుబాటులో ఉన్న అత్యవసర వాహనాల వివరాలను ఆటోమేటిగ్గా విశ్లేషిస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనానికి ఆటోమేటిక్‌గా సమాచారాన్ని పంపుతుంది. త్వరలో డ్రోన్‌ ఆధారిత సేవలు