
రంపచోడవరం, న్యూస్‌టుడే: చిన్ననాటి నుంచి కలిసే పెరిగిన తన స్నేహితురాలు ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన ఓ యువతి తానూ మృత్యువును ఆశ్రయించారు. ఈ ఘటన రంపచోడవరం మండలం బొర్నగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకొంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలం దామనపల్లి గ్రామానికి చెందిన కోట్ల వరలక్ష్మి, బొర్నగూడెం గ్రామానికి చెందిన చుప్పల మంగ(32) బాల్యం నుంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇరువురికి వివాహం కాలేదు. ప్రస్తుతం కూలిపనులు చేసుకొంటూ కుటుంబసభ్యులతో జీవిస్తున్నారు. వరలక్ష్మి ఈనెల 12న ఒంటిపై డీజిల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి వేదనతో ఉన్న మంగ తానూ చనిపోతానని తండ్రి లచ్చిరెడ్డితో తరచూ పేర్కొనేవారని కుటుంబసభ్యులు చెప్పినట్టు ఎస్సై తెలిపారు. రెండురోజుల క్రితం ఇంటి నుంచి మంగ వెళ్లిపోయారు. అప్పటినుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున తమ పొలంలో ఉరి వేసుకొన్న స్థితిలో మంగ మృతదేహం కనిపించింది. పంచనామా నిమిత్తం మంగ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నాలుగురోజుల వ్యవధిలో స్నేహితులిద్దరూ చనిపోవడంతో విషాదం నెలకొంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





