
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC)వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది. 2025లో ఉత్తర సరిహద్దుల్లో ఆ దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) మోహరింపులు భారీగా తగ్గినట్లు తన వార్షిక నివేదిక (2025-26)లో పేర్కొంది. 2020లో తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ఘర్షణలు జరిగిన తర్వాత 2024లో ఆయా ప్రాంతాల నుంచి రెండు దేశాల సైనిక దళాల ఉపసంహరణకు అవగాహన కుదిరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గతేడాది ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య చర్చలు జరిగాయి. దీంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొంత మేరకు ఉపశమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా సరిహద్దులకు ఇరువైపులా 10 చొప్పున కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్ల (సుమారు 40,000-50,000 మంది సైనికులను)ను మోహరించింది. అంతకుముందు కేవలం లద్దాఖ్‌ సెక్టార్‌లోనే 60,000 పైగా చైనా సైనికులు (Chinese forces) ఉండేవారు. బీజింగ్‌ తన మోహరింపులను తగ్గించినప్పటికీ.. భారత్‌ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ (LAC) పొడవునా అన్ని సెక్టార్లలో పటిష్టమైన సైనిక వ్యూహాన్ని, సంసిద్ధతను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ, దౌత్య చర్చల వల్లే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి, స్థిరత్వం నెలకొందని తెలిపింది. సైన్యం ( Indian Army ) అవిశ్రాంత కృషి వల్ల జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో శాంతిభద్రతలు నెలకొన్నాయని రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంది. కశ్మీర్‌ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని.. ప్రభుత్వం, భారత సైన్యం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపింది. దీంతో కశ్మీర్‌లో రాళ్ల దాడులు, నిరసనలు, హింసాత్మక ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూ కశ్మీర్‌లో, నియంత్రణ రేఖ (LoC) వెంబడి పరిస్థితి గణనీయంగా మారిందని పేర్కొంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





