
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాల్లోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఏనుగులు సంచరించే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు కనిపించిన వెంటనే సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బృందాలను మోహరించి ఏనుగుల కదలికలను పర్యవేక్షించాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఏనుగులను రెచ్చగొట్టకుండా, వాటికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
చంద్రగిరి పరిసర గ్రామాల్లో ఏనుగుల సంచారంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. అటవీ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏనుగులు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News





