
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడికి యత్నించిన ఘటన అత్యంత ఆందోళనకరమైనదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధికారిక ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు తీవ్రంగా ఖండించారు. విచారణ పేరుతో పండుగ రోజున పోలీస్ స్టేషన్కు పిలిపించిన వారిపై, పోలీసుల సమక్షంలోనే ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడికి ప్రయత్నించడం చట్టపరమైన ప్రక్రియను అపహాస్యం చేయడమేనని రవి ప్రదీప్ పులుసు అన్నారు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రదేశమని, అదే ప్రదేశంలో ఉన్న వ్యక్తులపై దాడికి ప్రయత్నించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ న్యాయ బృందం సభ్యులు అప్రమత్తమై ఈ చర్యను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత విషమించకుండా నిలిచిందని తెలిపారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తులు ముసుగులు ధరించి ఉండటం ఈ ఘటనపై అనేక అనుమానాలకు తావిస్తోందని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉన్న సమయంలో వాటిని పక్కనపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడటం న్యాయవ్యవస్థ పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని ఆయన అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టపరమైన పరిమితులను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఈ ఘటనపై హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అరాచక పాలనకు ఇది నిదర్శనమని, పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలని, ప్రజాస్వామ్య విలువలు మరియు న్యాయపాలనను కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే తరఫున డిమాండ్ చేస్తున్నామని రవి ప్రదీప్ పులుసు స్పష్టం చేశారు.





