
మునగాల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా అమరుల వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునగాల మండల పరిధిలో 33 మంది తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతు బిడ్డల ధైర్యం, కమ్యూనిస్టు నాయకుల పోరాటం దేశానికి మంచి చరిత్రను ఇచ్చిందన్నారు. రాజ్యాధికారానికి వ్యతిరేకంగా దేశంలో జరిగిన తొలి సాయుధ పోరాటంగా రైతాంగ పోరాటం నిలిచిందన్నారు. జమీందారీ విధానం, బానిసత్వం, వెట్టి చాకిరి లేకుండా చేసింది కమ్యూనిస్టుల పోరాటమే అన్నారు. సాయుధ పోరాటం ఇచ్చిన స్ఫూర్తితో దేశంలో అనేక ఉద్యమాలు రావడంతో నేడు ప్రజలు స్వేచ్ఛ, సమానత్వాలను పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సారెడ్డి రాఘవరెడ్డి, శ్రీనివాసు, సీపీఎం నాయకులు బుర్రి శ్రీరాములు, చంద్రయ్య, స్టాలిన్ రెడ్డి, ఉప్పుల యుగంధర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.