
Home » National » nagaland spurious liquor tragedy 9 dead red alert issued across state VVNP
నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర డీజీపీ రుపిన్ శర్మ వెల్లడించారు. వీరంతా టుయెన్సాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.
గువహాటి, సెప్టెంబర్13: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మరణించారని నాగాలాండ్ డీజీపీ రుపిన్ శర్మ వెల్లడించారు. వీరంతా టుయెన్సాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. కల్తీ మద్యం తాగి వీరంతా మరణించినట్లు నివేదిక అందడంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. మూన్, మోకోక్చుంగ్, టుయెన్సాంగ్, లాంగ్లెంగ్, కిఫైర్, షమాటోర్, నోక్లాక్ జిల్లాలోని ప్రజలెవరూ మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోని ప్రజలు కూడా మద్యానికి దూరంగా ఉండాలని డీజీపీ రూపిన్ శర్మ కోరారు.
అపరిచితులు లేదా అనధికారికంగా విక్రయించే మద్యాన్ని సేవించవద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయిందో గుర్తించేందుకు.. అందుకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. నాగాలాండ్‌లో 1989 టోటల్ లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ అమల్లో ఉంది. అయినా అక్రమ మద్యం మార్కెట్లతోపాటు కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.






