
జిల్లాలో పెరిగిపోతున్న అక్రమార్కుల దందాలు ఈనాడు, సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు పటాన్‌చెరు ప్రాంతాల్లో కొందరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో నేరస్వభావం కలిగిన వ్యక్తులు పోలీసు కేసులను సాదాసీదాగా తీసుకుంటున్నారు. నిబంధనలకు అనుగుణంగా పీడీ యాక్టు లేదా రౌడీషీట్‌ను ఓపెన్‌ చేస్తేనే వీరికి వణుకు పుట్టనుంది. కొందరు ఖాళీజాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. దీనికి తోడు తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో స్థిరాస్తి వ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పేరుగాంచిన వారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం శివారులో వెంచర్‌వేసిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు, బెదిరింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమార్కులపై మరింత ఉక్కుపాదం మోపాల్సిన ఆవసరం ఉంది. నిషేధిత మత్తు పదార్థాలైన అల్ప్రాజోలంతో పాటు గంజాయి రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందనే ఆరోపణలున్నాయి. జిల్లాలో కల్తీకల్లు తయారీలో దీన్ని విరివిగా వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన ఓ ముఠానే కల్తీకల్లు తయారీదారులతో పాటు పొరుగు జిల్లాలకు సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా సరిహద్దు మండలాలైన కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్‌ తదితర మండలాల్లో జూదం ఆడుతూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇదే విధంగా సంగారెడ్డి జిల్లాకేంద్రంతో పాటు జహీరాబాద్‌, సదాశివపేట పట్టణాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్కా నిర్వహిస్తున్నారు. వీటితో నిరుపేదలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. వీటిపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే విధంగా కర్ణాటక నుంచి జిల్లా మీదుగానే గుట్కా పొరుగు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోకి సంగారెడ్డి జిల్లా పోలీసు పరిధిలోని అమీన్‌పూర్, పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, కొల్లూరు, రామచంద్రాపూర్‌ ఠాణాలను చేర్చారు. అనంతరం జిన్నారం ఠాణా స్థాయిని పెంచి డీఎస్పీస్థాయి అధికారిని నియమిస్తామని ప్రకటించారు. ఇదే విధంగా ఇస్నాపూర్, ఇంద్రేశంలలో కొత్తగా ఠాణాలు ఏర్పాటు చేసి ఠాణాల పరిధిని నవీకరణ చేస్తామని చెప్పినప్పటికీ అమలు కాలేదు. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల అనుచరులుగా పేర్కొంటన్న కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పాటు పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికితోడు నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించే వ్యక్తులు, సంస్థలు ఎంతో కొంత ముట్టచెప్పకపోతే వివాదాలు సృష్టిస్తున్నారు. వాటిని తామే పరిష్కరిస్తామంటూ జోక్యం చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. కొందరు పోలీసు అధికారులు సైతం స్థిరాస్తి వివాదాల్లో జోక్యం చేసుకుంటూ పబ్బం గడుపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని అరికట్టకపోతే భవిష్యత్తులో జిల్లాలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణకు ఆటంకాలు తప్పవు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





