
చి త్రంలో కనిపిస్తున్న చెరువు చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లిలోని గసెర్లయ్య కుంట. 20 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఇందులోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. ప్రస్తుతం చెరువు ఎండిపోయింది. అక్కడక్కడా గుంతల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. అందులో నిమజ్జనం సాధ్యం కాదు. మరో చోట నిమజ్జనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నీరు లేక ఆయకట్టు రైతులు పంటలు సాగు చేయలేదు. చిన్నంబావి, పాన్‌గల్, న్యూస్‌టుడే: ప్రతి సంవత్సరం వినాయక చవితికి జిల్లాలోని అన్ని చెరువులు జల కళ సంతరించుకునేవి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని చాలా చెరువుల్లో గంగమ్మ జాడ కనిపించడం లేదు. సాధారణంగా వర్షాకాలంలో నిండుకుండగా ఉండాల్సిన ఇవి ఈ సారి ఆశించిన స్థాయిలో నిండ లేదు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయలేని పరిస్థితి నెలకొంది. సోమవారం వినాయక చవితి ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో నిమజ్జనం చేసేందుకు చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో నిర్వాహకులు ప్రత్నామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగం మాత్రమే నిండాయి.. : జిల్లాలో మొత్తం 1,258 చిన్న నీటి పారుదల చెరువులు ఉన్నాయి. 66,362 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కేవలం సగం వరకు మాత్రమే నిండాయి. కొన్ని ఎండిపోయి ఉన్నాయి. ఎల్‌నినో కారణంగా జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. కేవలం జూరాల, భీమా, కేఎల్‌ఐ కాల్వలకు సమీపంలోని చెరువుల్లో మాత్రమే నీరుంది. వర్షాధారంగా ఉన్న చెరువులు ఏవీ నిండలేదు. సెప్టెంబరు 13వ తేదీ దాటినా నేటికీ చెరువులు నిండకపోవడంతో వాటి కింద ఉన్న రైతులు పంట విరామాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. చెరువుల్లో నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉండేది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




